యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జిల్లా ఓటర్ల జాబితాలో మళ్లీ ఆమెకే ఆధిపత్యం దక్కింది. ఎన్నికల సంఘం ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో సైతం ఆమె అగ్రభాగంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఎన్నికల సంఘం ప్రచురించిన జాబితాలో జిల్లా మొత్తం 33,03,592 ఉండగా.. తాజాగా ఆదివారం విడుదల చేసిన జాబితాలో జిల్లా మొత్తం 34,12,581 మంది ఉన్నారు. అంటే తాజాగా 1,08,989 ఓట్లు పెరిగాయి. వీటిలో మహిళలు 16,69,703 ఉండగా, పురుషులు 16,33,595 ఉన్నారు. తాజాగా ఆదివారం విడుదల చేసిన జాబితాలో మహిళలు 17,29,186 మంది ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సారి ఎన్నికలో మహిళా ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. ఊరూరా వారి సంఖ్యా బలం ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ పురుషులతో పోటీ పడి మరీ పైచేయి సాధించారు. అన్ని నియోజకవర్గాల్లో సైతం ఆమె డామినేషనే దర్శనమిస్తోంది. జిల్లాలో 16 నియోజకవర్గాలుండగా.. 5 నియోజకవర్గాల్లో మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. పురుషుల కంటే మహిళల ఓట్లు 46,103 అధికంగా ఉన్నాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళల హవానే కొనసాగింది. ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. అప్పట్లో మొత్తం ఓట్లు 33,37,071 ఉండగా.. పురుషులు 16,58,639 ఉండగా.. మహిళలు 16,78,118 ఉన్నారు. అంటే 19,479 మంది మహిళలు అధికంగా తమ ఓటు హక్కు వినియోగించారు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లాలో రాజకీయ పార్టీలకు ప్రతి అంశమూ కీలకమైందే. ఇక్కడ సామాజిక సమీకరణలతో పాటు, సమ ప్రాధాన్యంపై ఆసక్తి చూపుతారు. సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటం, ఊరూరా అభ్యర్థుల ప్రకటనల్లో రాజకీయ పార్టీలు బిజీగా ఉండటం కీలకంగా మారింది. ఓటరు జాబితాలను పట్టుకుని మరీ తమకు అనుకూలమైన ఓటర్లు ఎక్కడున్నారన్న వేట మొదలు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో రాజకీయ పార్టీలు తలమునకలవుతున్నాయి. మహిళలకు ఇష్టమైన చీరలు, ముక్కు పుడకలు ఇచ్చి తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. మరో అడుగు ముందుకేసిన టీడీపీ.. మహిళా ఓటర్లపై గురి పెట్టింది. ఇప్పటికే స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు పసుపు–కుంకుమ పేరుతో రూ.2,500 నగదు జమ చేసింది. ఆ నగదులో సింహభాగం మహిళలకు చేరిన దాఖలాలు లేవు.కొంత మేర బ్యాంకర్లు అప్పులకు జమ చేసుకోగా.. మరి కొంత నగదు అసలు చేతికే అందలేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు ట్యాబ్‌లు అందజేసింది. అవిసైతం పూర్తిస్థాయిలో అందకపోగా.. మరికొన్ని నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి