యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వంగవీటి రాధాకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం ఇంకా తేలడం లేదు.అసలు ఆయన పోటీ చేస్తారా..? లేక పార్టీ ప్రచారానికే పరిమితమవుతారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు పార్టీగాని స్వయంగా రాధా గాని నొరు విప్పి చెప్పింది లేదు. కొద్దిరోజుల క్రితం రాధా వైసీపీ నుంచి బయటకి వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీలో చేరేంత వరకు కూడా సస్సెన్స్ కొనసాగించడం వెనుక అంతరార్థం తెలియరావడం లేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా ఇప్పుడు టీడీపీకి బలం కాబోతున్నారన్న వార్తలు, విశ్లేషణలు ఆయనపై వెలువడుతున్న మాటైతే వాస్తవం. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రాధా ఆసక్తిగా ఉన్నా చంద్రబాబు సూచించిన నాలుగైదు స్థానాల్లోంచి పోటీకి రాధా వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.అయితే తాను స్వయంగా ఈ సీటు నుంచి పోటీ చేస్తానని చెప్పింది కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అసలు ఆయనకు పోటీ చేయడం ఇష్టం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆ విషయాన్ని బయటకి చెప్పకుండా పార్టీ ప్రచారానికే పరిమితమవుదామనే ఆలోచనతో ఉన్నట్లు కొంతమంది విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు యోచించినట్లు తెలుస్తోంది. ప్రతి సారి ఈ స్థానం నుంచి కమ్మ సామాజిక వర్గం నేతలే బరిలో ఉంటూ వస్తుండగా ఈ సారి కాపు సామాజికవర్గం నేతలకు అవకాశం ఇచ్చి చూద్దామనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు మాత్రం రాధా సముఖత చూపలేదని తెలుస్తోంది. ఇక సత్తెనపల్లి ఇప్పటికే కోడెలకు కేటయించగా…మిగతా రెండు మూడు స్థానాలపైనా చర్చ జరిగి..అది చర్చలకే పరిమితమైంది.ఉభయ గోదావరి జిల్లాలో రాధా చేత ప్రచారం చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అక్కడి నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు దూరంగా ఉన్న రాధాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అవకాశమూ లేకపోలేదని సమాచారం. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటే అనుచరులు దూరమై ఉనికి కాపాడుకోవడం కొంత కష్టమవుతుందని, ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఇది కరెక్ట్ కాదన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇప్పట్లో అయితే విజయవాడ ప్రాంత రాజకీయాల్లో ఆయన అంతగా రాణించలేకపోవచ్చుననే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తుండటం గమనార్హం. చూడాలి. పార్టీ ఆయనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదో మరి..!