యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పెథాయ్ తుపాను అన్నదాతపై పగబట్టింది.. ధాన్యం రంగు మారేలా చేసింది.. ప్రభుత్వం వీటిని కొనేందుకు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. పలు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కొన్నది కొంత.. ఉన్నవి కొండంతలా పేరుకుపోయాయి. ఈలోగా కొనే సమయం తరిగిపోతోంది.. అమ్మకాలకు మిగిలింది నాలుగురోజులే.కేంద్రాల్లో విక్రయిస్తేనే ఫలితం దక్కుతుంది.. లేకుంటే తక్కువ ధరకు దళారుల పరమవుతుంది..
జిల్లావ్యాప్తంగా పండిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 2.47 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. 13.70 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. దానికి తగ్గట్టుగానే ఆయా ప్రాంతాల్లో దిగుబడులు వచ్చాయి. తుపాను తరువాత పంటలు పాడైపోవడంతో ధాన్యాన్ని విక్రయించుకోడానికి సాగుదారులు ఇబ్బందులు పడ్డారు. బందరు, పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, గుడ్లవల్లేరు, ముదినేపల్లి, పామర్రు, మొవ్వ ఇలా అన్ని ప్రాంతాల్లో సాగు చేశారు. కుప్పలు వేసే సమయంలో తుపాను రావడంతో ఎక్కువ శాతం మంది పొలాల్లోనే కుప్పలు వేశారు. అపరాల పంట తీతకు రావడంతో నూర్పిళ్లు సాగుతున్నాయి.
జిల్లాలో ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు కొనుగోలు కేంద్రాలకే ధాన్యం విక్రయిస్తున్నారు. సకాలంలో నగదు జమకావడంలేదని వాపోతున్నారు. అన్ని ప్రాంతాల్లో పంట నూర్పిళ్లు చేయడంతోపాటు అపరాల పనులు సాగుతున్నాయి. కూలీల ఖర్చుల తదితరాలకు డబ్బు అవసరం. పంట నూర్పిళ్లు చేసిన ట్రాక్టర్ యజమానులు కూడా డబ్బులకు ఆగడంలేదని చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ధాన్యం విక్రయించినా త్వరితగతిన నగదు జమకావడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. పెడన, గూడూరు, బందరు ఇలా అనేక ప్రాంతాల్లో రైతులు మార్కెట్ కమిటీలు, కొనుగోలు కేంద్రాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ నుంచి నగదు సకాలంలో జమ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
జిల్లాలో ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లోని కేంద్రాల ద్వారా 8.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రూ.1315 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.146 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉంది. ● ఇప్పటి వరకు కేవలం వీఆర్వో ధ్రువీకరించిన పత్రాలతో నగదు చెల్లించే వారు. ప్రస్తుతం రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటేనే నగదు ఖాతాలకు జమ చేస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చాలామందికి చెందిన భూముల వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా రంగుమారిన ధాన్యం కొనేందుకు 41 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 13,500 టన్నుల ధాన్యం కొన్నారు. ధాన్యం రంగుమారడం, మొలకలు రావడంతో కొనుగోలు చేయడానికి వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు. బస్తా రూ.1,350 మద్దతు ధర ఉంటే బయట దెబ్బతిన్న ధాన్యాన్ని రూ.1,000 మించి కొనడంలేదు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 47వేల హెక్టార్లలో వరి పంట రంగుమారింది. వాటిలో 28 వేల హెక్టార్లు బందరు డివిజన్ పరిధిలోనిదే. ఈ డివిజన్ పరిధిలోని గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను ఇలా అన్ని ప్రాంతాల్లోనూ పంటలు పాడైపోయాయి. దాదాపు 1.60 లక్షల టన్నులకుపైగా ధాన్యం రంగు మారింది.