యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కర్ణాటకలోని ధార్వాడ్ కమలేశ్వర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల్లో దాదాపు వంద మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు, ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని శిథిలాల నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.భవనంలో ఒకటి, రెండు అంతస్తుల్లో నిర్మాణం పూర్తయి ఇప్పటికే పలువురు అద్దెకు ఉంటున్నారు. నాలుగో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు వంద మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.కాగా.. ఈ భవనం కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వినయ కులకర్ణి బంధువులకు చెందినదిగా తెలుస్తోంది. నాసిరకం మెటీరియల్ వాడటం వల్లే భవనం కూలి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.