YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆప్‌ తో పొత్తు వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం: షీలా దీక్షిత్‌

ఆప్‌ తో పొత్తు వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం: షీలా దీక్షిత్‌

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)తో పొత్తు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌ పేర్కొన్నారు.ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే పొత్తుపై త్వరగా తేల్చాలని ఆమె కోరారన్నారు. లేదంటే పార్టీ కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ సీనియర్ నేత కాంగ్రెస్ ఢిల్లీ  ఇన్‌ఛార్జి పీసీ చాకో మాత్రం పొత్తుపై సానుకూలంగా ఉన్నారు. ‘‘భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలతో కలిసి వెళ్లాలన్నది కాంగ్రెస్‌ విధానం. ఈ మేరకు కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. దీనికి అనుగుణంగానే ఢిల్లీ  నాయకులు నడుచుకోవాల్సి ఉంటుంది’’ అని చాకో అభిప్రాయపడ్డారు. దీనిపై త్వరలో రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. ‘‘భాజపాను ఓడించడమే తక్షణ కర్తవ్యంగా ఢిల్లీ  అధినాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఆప్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పార్టీలో చాలా మంది సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు’’ అని చాకో వెల్లడించారు.కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌తో ఎటువంటి పొత్తు ఉండదని కాంగ్రెస్‌ గతంలో ప్రకటించినప్పటికీ..ఆ నిర్ణయంపై పునరాలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిపిన పార్టీ అంతర్గత సర్వేలో రెండు పార్టీల కంటే భాజపా ముందంజలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భాజపాను ఓడించాలంటే ఆప్‌తో జట్టు కట్టాల్సిందేనని నాయకులు సూచిస్తున్నారని సమాచారం. సర్వే ఫలితాలను షీలా దీక్షిత్‌తో పాటు పార్టీ అధినాయకత్వానికి చాకో నివేదించినట్లు నాయకులు పేర్కొన్నారు. కానీ సర్వేపై ఢిల్లీ  శాఖ మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఆప్‌ వేర్వేరుగా పోటీ చేయడం వల్ల భాజపాకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని భావించిన కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. కానీ కాంగ్రెస్ విముఖత వ్యక్తం చేసింది. దీంతో కేజ్రీవాల్‌ అన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. 

Related Posts