యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు కల్పించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా అవినీతిమయం చేశారని, అంచనాలు దారుణంగా పెంచి, నామినేషన్లపై పనులు అప్పగిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ వైఫల్యాలన్నింటినీ ప్రజలు ఎత్తి చూపడంతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని.. ఒక రోజు డయాఫ్రమ్ వాల్ అని, మరో రోజు స్పిల్ వే అని, ఇంకో రోజు ఒక్క గేటు పెట్టి ప్రాజెక్టు పూరై్తందంటూ పూజలు చేసి, ఎంతో షో చేస్తున్నారని ఆయన తెలిపారు. నిర్మాణంలోనే ప్రాజెక్టు బీటలు వారుతోందని, ఆ స్థాయిలో అవినీతి జరుగుతోందని, ఇది చంద్రబాబు దారుణ పాలన అని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు, భూములు ఇచ్చిన రైతులకు తగిన న్యాయం చేస్తామని జగన్ ప్రకటించారు. 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తామని, అంతకు ముందు భూములిచ్చిన వారికి కూడా ఎకరాకు రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు. ఇక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇప్పుడు ఇస్తున్న రూ.6.5 లక్షలు సరిపోనందున, రూ.10 లక్షలు ఇస్తామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో మంగళవారం ఉదయం జగన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో కొయ్యలగూడెం సభ జనసంద్రంగా మారింది.
దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి దీవెనలతో 14 నెలలు దాదాపు 3648 కి.మీ పాదయాత్ర చేశానని, ఆ యాత్రలో అందరి కష్టాలు చూశానని, బాధలు విన్నానని, అన్నీ అర్ధం చేసుకున్నానని, ఇంకా ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నానని జగన్ వెల్లడించారు.
చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే రేషన్ కార్డులు తీసేశాడని, పింఛన్లు తొలగించడమే కాకుండా, ఎన్నికైన స్థానిక ప్రజా ప్రతినిధులను పక్కనపెట్టి జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను తీసుకువచ్చాడని అయనే గుర్తు చేశారు. ఆ జన్మభూమి కమిటీలు గ్రామాల్లో మట్టి మొదలు అన్నీ దోచేశాయని, ప్రతి పనికి లంచం తీసుకున్నాయంటూ.. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఏ పనులకు ఎంతెంత వసూలు చేశాయన్నది ప్రస్తావించారు.
అధికారం చేపట్టిన వెంటనే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేశానంటూ 2014, సెప్టెంబరులో కొయ్యలగూడెం వచ్చిన చంద్రబాబు వారితో సన్మానం చేయించుకున్నారని, శాలువాలు కప్పించుకున్నారని గుర్తు చేశారు.
ఇప్పుడు ఎన్నికలు రావడంతో ఓట్లు కొనుగోలు చేసేందుకు ఒక్కో మహిళకు రూ.10 వేల రూపాయలు ఇస్తున్నట్లు చెక్కులు ఇచ్చారని, కానీ అందరు మహిళలకు ఇచ్చిన మొత్తం చూస్తే అది రూ.6 వేల కోట్లు కూడా దాటలేదని చెప్పారు. నిజానికి 2016, సెప్టెంబరు నుంచి ఆ మహిళలకు సున్నా వడ్డీ రుణాల బకాయిలు కూడా చంద్రబాబు ఎగ్గొట్టారనితెలిపారు. చంద్రబాబును నమ్ముకుని మహిళలు రుణాలు చెల్లించకపోతే వారి ఇళ్లు, ఆఫీసులకు బ్యాంకులు తాళాలు వేస్తున్నాయని చెప్పారు.
రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. పామాయిల్కు ఇక్కడ ఒక ధర ఉంటే, పక్కనే తెలంగాణలో మరో ధర ఉందని, పొగాకు వేలంలోనూ రైతులకు న్యాయం జరగకపోతే, చాలా చోట్ల స్వయంగా పర్యటించానని చెప్పారు. రైతులకు ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని తెలిపారు. ఎక్కడైనా రైతులు బలవన్మరణానికి పాల్పడితే వెంటనే సహాయంగా రూ.7 లక్షలు ఇస్తామని, ఆ మొత్తం ఆడపడుచు కట్నంగా ఇచ్చి, ఆ డబ్బు అప్పులవాళ్లు తీసుకుపోకుండా శాసనసభ తొలి సమావేశాల్లోనే ఒక చట్టం చేస్తామని వివరించారు. పక్కనే పోలవరం ప్రాజెక్టు ఉందని గుర్తు చేసిన శ్రీ వైయస్ జగన్, దాని గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ ప్రాజెక్టులో ఏ సమస్య వచ్చినా, ప్రజల తరపున తాను, తన పార్టీ మాత్రమే ధర్నాలు, ఆందోళనలు కొనసాగించిందని చెప్పారు. అందుకే ఇక్కడి రైతులకు హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.