యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కలుసుకున్నారు. వేర్వేరుగా నామినేషన్లు వేసే ముందు ఆయా అభ్యర్థులు ముఖ్యమంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉండవల్లి నుంచి కర్నూలు సభలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రాకతో సందడిగా మారింది. ఎన్నికల యుద్ధానికి పసుపు సైనికులను సన్నద్ధం చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 'ఎన్నికల సన్నాహక సమావేశం'సభల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. మంగళవారం మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించడానికి ప్రథమంగా కర్నూలు వెళ్ళారు.
ముఖ్యమంత్రితో మాజీ మంత్రి సబ్బం హరి భేటీ
ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ మంత్రి సబ్బం హరి భేటీ అయ్యారు. ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన సబ్బం హరిని తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. విశాఖ జిల్లా భీమిలి శాసనసభకు అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సబ్బంహరి కృతజ్ఞతలు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలు పరిస్థితులపై సీఎం, సబ్బం కొద్దిసేపు చర్చించారు.ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికిసైతం తనవంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రికి సబ్బం హరి హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి ఎం. హనుమంతరావును పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి
గుంటూరు జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ఉండవల్లిలోని నివాసంలో మురుగుడు హనుమంతరావుతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు అంశాలపై చర్చలు జరిపారు. ఇరువురి మధ్య సామరస్యపూర్వక చర్చలు చోటుచేసుకున్నాయి. ఇరువురు నేతల సంభాషణలో మంగళగిరిలో నారా లోకేష్ పోటీ, ప్రచార సరళిపై చర్చకు వచ్చాయి. నారా లోకేష్ విజయం సునాయాసమని, ప్రచారంలో తనవంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రికి మురుగుడు హనుమంతరావు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మురుగుడు హనుమంతరావుకు తెలుగుదేశం పార్టీ సముచితంగా పదవులిచ్చి గౌరవిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ``నారా లోకేష్ విజయంపై మీరు దృష్టి పెట్టండి, మీరు భవిష్యత్తుకు నేను బాధ్యతగా తీసుకుని మేలు చేస్తా”నని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మురుగుడు హనుమంతరావుతో తెదేపా నాయకుడు దండమూడి మనోజ్ కుమార్ కూడా ఉన్నారు.
ఉండవల్లిలోని నివాసంలో నరసరావుపేట శాసనసభ తెదేపా అభ్యర్థి డాక్టరు చదలవాడ అరవిందబాబు, కనిగిరి శాసనసభ తెదేపా అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి, అమలాపురం శాసనసభ తెదేపా అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావులు కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీర్వాదం తీసుకున్నారు. డాక్టరు చదలవాడ అరవిందబాబును తెదేపా అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఆయనతోపాటు ఏపీ నూర్ భాషా దూదేకుల ముస్లిం ఫెడరేషన్ చైర్మన్ డాక్టరు పి.బాబన్ , గుంటూరు జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు ఎర్రగోపు నాగేశ్వరరావు,ఏపీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజా మాస్టారులు కూడా ముఖ్యమంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
గాదే వెంకటరెడ్డి, వేగేశ్న నరేంద్రవర్మలకు ఎమ్మెల్సీలుగా అవకాశం
మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి, వేగేశ్న పౌండేషన్ ఛైర్మన్ వేగేశ్న నరేంద్రవర్మలకు భవిషత్తులో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును గాదే వెంకటరెడ్డి, నరేంద్రవర్మలు మర్యాదపూర్వకంగా కలిసారు. తెదేపా ప్రకటించిన అభ్యర్థుల విజయానికి శాయశక్తులా కృషి చేస్తామని వీరివురూ సీఎంకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కొన్ని రాజకీయ సమీకరణాల రీత్యా ప్రస్తుతం న్యాయం చేయలేకపోయామన్నారు. సీనియర్ నాయకులైన వెంకటరెడ్డి, వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ నరేంద్రవర్మలను సముచితంగా గౌరవించుకునే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయంగా, సామాజికంగా, సేవాతత్పరతో సేవలందిస్తున్న వెంకటరెడ్డి, నరేంద్రవర్మలకు పదవులు కట్టబెట్టడంలో ప్రాధాన్యమిస్తామన్నారు. అన్ని వర్గాలకు తగిన సమయంలో న్యాయం చేయడంలో తెదేపా ముందు ఉంటుందని సీఎం గుర్తు చేశారు.