యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అందరి అభిప్రాయాలు తీసుకుని గెలుపు గుర్రాలనే ఎంపిక చేశామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇక తెదేపా గెలుపు ఏకపక్షం కావాలని ఆయన కోరారు. అమరావతిలోని తన నివాసంలో పార్టీ నేతలతో మంగళవారం చంద్రబాబు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. దొంగ సర్వేలతో ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా, కుట్రలు పన్నినా తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు చెప్పారు. ప్రజల్లో తెలుగుదేశం పట్ల ఉన్న సానుకులతను ఎవరూ తగ్గించలేరని స్పష్టం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటేయాలని పథకాల లబ్ధిదారులు కసి, పౌరుషంతో ఉన్నారని, దీంతో వైకాపాకు ఓటమి భయం వెంటాడుతోందని అన్నారు. దిక్కు తోచని స్థితిలో ఎంతటి అరాచకాలకైనా వైకాపా సిద్ధమవుతోందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.
నేరగాళ్లకు కేరాఫ్ వైకాపా
జగన్ అభ్యర్థుల ప్రకటన విధానంపైనా చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు వైకాపా ప్రకటించింది అభ్యర్థుల ప్రకటనా? లేదా నేరగాళ్ల ప్రకటనా? నిలదీశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ నేరగాళ్ల పార్టీతోనని ధ్వజమెత్తారు. అభ్యర్థుల ప్రకటనతోనే ఆపార్టీ ఎలాంటిదో అర్థమవుతోందంటూ మండిపడ్డారు. అటు, ఇటు నేరగాళ్లతో జగన్ అభ్యర్థుల ప్రకటన ఉందని దుయ్యబట్టారు. ఒక వైపు నందిగం సురేష్, మరోవైపు ధర్మాన ప్రసాదరావును పెట్టుకుని మధ్యలో 12 చార్జిషీట్లలో ఏ1 నిందితుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని విమర్శించారు. నందిగం సురేష్ రాజధాని విధ్వంసంలో నిందితుడని, అరటి తోటలు తగులపెట్టిన కేసుల్లో ఉన్నాడని గుర్తుచేశారు. కన్నెధార గ్రానైట్ కొండలు తవ్వేసిన మరో నిందితుడు ధర్మాన ప్రసాదరావు అని ఆరోపించారు. నేరగాళ్ల కేరాఫ్ అడ్రస్గా వైకాపా మారిందని దుయ్యబట్టారు.