చంద్రగిరి నియోజకవర్గం గత ఎన్నికలు ముగిసిన నాటి నుంచి నేటి ఎన్నికల కాలం దగ్గరపడుతున్న కాలం వరకు నిత్యం వార్తల్లో నానుతూ..రాజకీయ సంచనాలకు కేంద్రబిందువుగా మారుతోంది. చిత్తూరు జిల్లాలో భాగంగా ఉన్న ఈ నియోజకవర్గంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లె ఉంది. చంద్రబాబు ఇక్కడి పోటీ చేసి గెలిచారు. ఆయన రాజకీయ అడుగులు పడింది ఇక్కడే. ఈ నియోజకవర్గానికి 10 మార్లు ఎన్నికలు జరగగా ఐదుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. రెండుసార్లు టీడీపీ మరో రెండుసార్లు స్వంతంత్రులు ఒకసారి వైసీపీ గెలిచాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. వచ్చే ఎన్నికలకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. టీడీపీ వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులిపర్తి నాని బరిలోకి దింపుతోంది.వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎలాగైనా ఓండిచాలని ముందే కంకణం కట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేసేందుకు అభ్యర్థిగా పులిపర్తి నానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో నాని ముందు నుంచే టీడీపీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. అధినేత అపాయింట్‌మెంట్ కోసం నేతలకే కష్టమైనా నానికి మాత్రం అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఎప్పుడంటే అప్పుడు మాట్లాడే స్వేచ్ఛ అవకాశాలను అధినేత కల్పించినట్లు సమాచారం. టీడీపీ అధినేత సొంత జిల్లా కావడం అదికూడా తన సొంత నియోజకవర్గంలో వైసీపీ పాగా వేయడాన్ని చంద్రబాబు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారని వినికిడి. దీంతో ఎలాగైనా అక్కడ చెవిరెడ్డి వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించాలని చూస్తున్నారట. అందుకోసం పులిపర్తికి పార్టీ పరంగా పూర్తి అండదండలు కల్పిస్తున్నారు.పార్టీ చేతిలోనే ప్రభుత్వ పగ్గాలు ఉండటంతో ప్రజల సమస్యలను తెలుసుకుంటునే సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడటం..వైసీపీ కుట్రలను తిప్పికొట్టడం ఎప్పటికప్పుడూ చేపడుతుండటంతో సహజంగానే నేతల ఇద్దరి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. గత ఏడాదిన్నర కాలంగా చంద్రగిరి నియోజకవర్గం వార్తల్లో నానుతూనే ఉంది. నేతల నిర్బంధాలు..దాడులు..ప్రతిదాడులు..కేసులు వంటి సంఘటనలతో ఎప్పుడూ ఉద్రిక్తత పరిస్థితులు ఉంటూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చే ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి..ఫలితం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రాష్ట్ర ప్రజానీకంలో నెలకొని ఉంది. ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుకుంటూ వేడి పెంచుతున్నారు.