Highlights
- హామీలను నెరవేర్చమంటే..
- కొత్త వారిని నియమించాలని ఆదేశాల జారీ
- కార్మికుల్లో చీలికకు కుట్ర?
తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సమ్మె చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇందులో ఏజెన్సీ నిర్వాహకులు అలక్ష్యం ప్రదర్శిస్తే వారిపై చర్యలకు కూడా వెనుకాడొద్దని సూచించినట్లు తెలిసింది.ఈ నెల 20 సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్ సోర్సింగ్ విద్యుత్తు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు.
హామీలను నెరవేర్చమంటే..
ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు అర్హత కలిగిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తామని, మిగిలిన వారికి శాశ్వత ఉద్యోగులకు సమానంగా సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. హామీలు అమలు కోసం నాలుగేళ్లలో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఈక్రమంలోనే అనివార్య పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు దిగారు. డిమాండ్లను పరిష్కరించక పోగా సమ్మెలో వెళ్లిన వారి స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన కొత్త వారిని నియమించాలని ఆదేశాల జారీ చేయడం పట్ల కార్మికులు మండిపడుతున్నారు.
వ్యథా భరితం..
ఫోల్ టు ఫోల్ వర్కర్లు, బిల్లింగ్, స్పాట్ బిల్లింగ్, ఎస్పీఎం కార్మికులకు ఏజెన్సీల ద్వారా ప్రస్తుతం నెలకు రూ.6500 నుంచి రూ.12000 వరకు వేతనం చెల్లిస్తున్నారు. వేతనాల నుంచి మినహాయించుకుంటున్న ఈపీఎఫ్, ఈఎస్‌ఐ కంతులను కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు స్వాహా చేసిన సందర్భాలూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తున్న కార్మికులకు ఈఎస్‌ఐ సదుపాయం కల్పించడంలేదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి పరిహారం అందకపోవడంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరోవైపు అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులు, రాజకీయ నాయకులకు నచ్చకపోయినా నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగిస్తున్నారు.
కార్మికుల్లో చీలికకు కుట్ర?
కాగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు దిగిన కార్మికుల్లో చీలిక తెచ్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న యూనియన్ తో పాటు మరో యూనియన్ సమ్మెకు దూరంగా ఉన్నాయి. సమ్మెలో వెళ్లొద్దని కూడా తమ యూనియన్లలో సభ్యత్వం ఉన్న కార్మికులకు సూచించినట్లు సమాచారం.