యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విశాఖ నగరం...అగ్నిగుండం...ఎండలు మండిపోతున్నాయి....సూరీడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు...ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంది...జనం అల్లాడిపోతున్నారు...ఉదయం నుంచే ఎండ తీవ్రత ఉండగా, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు...గురువారం విశాఖ విమానాశ్రయంలో 37డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఇవి సాదారణం కంటే కూడా మూడు డిగ్రీల అధికమని విశాఖపట్నం వాతావరణ కేంద్రం గురువారం పేర్కొంది. అదే గత ఏడాది ఇదే సమయానికి కాస్తంత తక్కువుగా ఉండే పరిస్థితులు కనిపించగా ఈసారి మార్చి రెండవ వారంలోనే తీవ్రత పెరిగింది. ఇవే పరిస్థితులు కొనసాగవచ్చని, లేదంటే మధ్యలో కాస్తంత ఉపశమనం కలగవచ్చని ఈ కేంద్రం తెలియజేసింది. మండుతున్న ఎండలు రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. ఆసుపత్రులకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. వృద్ధులు, మహిళలు తిరిగేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రోగుల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. ఆసుపత్రులకు తరలివెళ్ళేవారు బాధలు వర్ణనాతీతం. మరోపక్క డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండటంతో ఎండలే పెద్ద పరీక్షగా మారింది. నగరంలోని ప్రధాన కూడళ్ళు, జంక్షన్ల వద్ద నిర్మాన్యుషంగా మారుతోంది. నిత్యం రద్దీగా ఉండే అల్లిపురం, జ్ఞానాపురం, పూర్ణామార్కెట్‌లతోపాటు నగరంలోని అక్కయపాలెం, మర్రిపాలెం, కంచరపాలెంమెట్టు, ఎంవీపీ కాలనీ, మధురవాడ తదితరచోట్ల రైతుబజార్లు వినియోగదారుల తాకిడి తగ్గడంతో బోసిపోతున్నాయి. కూరగాయలు కొనుగోలు చేసేందుకు కాస్తంత ఆసక్తి చూపే వినియోగదారులు ఎండకు భయపడి ఉదయం సమయంలోనే వెళ్తున్నారు. వృద్ధులు, మహిళలు ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళేందుకు భయపడుతున్నారు.
నగర శివారుప్రాంతాల్లో ఇప్పటి నుంచే నీటి కొరత ఏర్పడింది. మునిసిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా తక్కువ సమయంలోనే వస్తుండగా, భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోతున్నాయి. ఫలితంగా గొట్టపుబావులు మొరాయిస్తున్నాయి. దీనివల్ల తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. గుక్కెడు నీటి కోసం మహిళలు దూరప్రాంతాలకు తరలివెళ్ళాల్సి వస్తోంది. నగరంలోని కొన్ని మురికివాడలను శివారు ప్రాంతాలకు తరలించడంతోనే నీటి ఎద్దడి ఉందంటూ అనేక ప్రాంతావాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి సీజన్‌లోనైనా వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరిగేది. అటువంటిది ఈసారి ఇప్పటికీ ఇవేమీ ప్రత్యక్షంకావడంలేదు. ఎక్కువుగా ఎండాడ, కారుషెడ్ ఏరియా, మదురవాడ వాంబేకాలనీ, పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీ, బక్కన్నపాలెం ఎన్‌టీఆర్ కాలనీ, అంబేద్కర్‌నగర్, కొమ్మాది, బోయిపాలెం, మధురవాడ నగరపాలెం, గణేశ్‌నగర్ తదితర ప్రాంతాల్లో స్థానికులు నీటి కోసం అనేక అవస్థలు పడాల్సి వస్తోంది.
ఎండల తీవ్రతతో విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతోంది. ఏసీల వాడకానికి అదుపు లేకుండా పోతోంది. నిన్న, మొన్నటి వరకు 18నుంచి 20 మిలియన్ యూనిట్ల మేర రోజుకీ విద్యుత్ వాడకం జరుగగా, ఇపుడు ఇది కాస్త దాదాపు 23మిలియన్ యూనిట్లకు చేరినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. సాధారణం కంటే మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో దీనికి తగినట్టుగా వాడకం పెరిగిపోతుంది. ఒకవైపు పరిశ్రమలు, మరోపక్క వాణిజ్య సముదాయాలు, గృహ అవసరాలకు వాడే విద్యుత్ రోజురోజుకీ పెరుగుతున్నందున దీనికి తగినట్టుగా ఈపీడీసీఎల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో ఈ ఎండల తీవ్రతకు తగినట్టుగా అవసరమైన విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.