యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్చి 21, 22 తేదీల్లో నామినేషన్ వేయనున్నారు. 21న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య గాజువాకలో పవన్ నామినేషన్ దాఖలు చేస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య భీమవరంలో రిటర్నింగ్ అధికారికి పవన్ నామినేషన్ పత్రాలు అందజేస్తారు. తన సినీ ప్రస్థానం ప్రారంభానికి విశాఖలోనే నటనలో ఓనమాలు నేర్చుకున్నానని పవన్ తెలిపారు. భీమవరంలోనే సమాజాన్ని చదవడం మొదలుపెట్టానని జనసేనాని చెప్పారు. గాజువాకలో జనసేన బలంగా ఉంది. ఇక్కడ ఆ పార్టీకి లక్ష సభ్యత్వాలు నమోదయ్యాయి. అందులోనూ విశాఖ ఉత్తరాంధ్రకు ముఖద్వారం కాబట్టి గాజువాక నుంచి పవన్ బరిలో నిలుస్తున్నారు. మరి పవన్ భీమవరం ఎంచుకోవడానికి ఓ సెంటిమెంట్ కారణమని చెబుతున్నారు. 1989 నుంచి భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. 1989లో కాంగ్రెస్ నుంచి అల్లూరి సుభాష్ చంద్రబోస్ విజయం సాధించారు. 1994, 1999లలో టీడీపీ అభ్యర్థి పెనుమత్స వెంకట నర్సింహ రాజు గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ నుంచి గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. 2009లో ఆయన్ను కాదని పులపర్తి రామాంజనేయుులికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా ఆయన గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. దీంతో భీమవరంలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీదే అధికారం అనే సెంటిమెంట్ ఏర్పడింది. ఏపీ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండనుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందా? పవన్ సీఎం అవుతారా? అనేది త్వరలోనే తేలనుంది.
అక్కడ్ని నుంచే ఎందుకు...
పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పెద్ద పట్టణమైన భీమవరంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన పులపర్తి రామాంజనేయులు కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ పై 13 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాపులతో పాటు రాజులు గెలుపోటములను ప్రభావితం చేసే ఈ నియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ రెండు స్థానంలో నిలిచింది. పీఆర్పీ నుంచి పోటీ చేసిన సూర్యనారాయణరాజు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రామాంజనేయులు చేతిలో ఓపోయారు. ఈసారి మళ్లీ ఇక్కడి నుంచి టీడీపీ తరపున రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. కాపు సామాజకవర్గానికే చెందిన ఆయన ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ విజయం సాధించిన వారవుతారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి బరిలో ఉండనున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఆయనపై ఉంది. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఉండనుంది. పవన్ కళ్యాణ్ కు స్వంత సామాజకవర్గం అభ్యర్థి నుంచే పోటీ ఉండటంతో కాపు ఓట్లు కొంత మేర చీలే అవకాశం ఉంది.విశాఖపట్నం జిల్లాలోని గాజువాక స్థానం నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత జనసేన పార్టీ బలంగా ఉన్న జిల్లా విశాఖపట్నం. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ స్వంత కాపు సామాజకవర్గం ఓటర్లు అధికారం. 2009లోనూ ప్రజారాజ్యం ఇక్కడ సత్తా చాటింది. ప్రజారాజ్యం తరపున ఆ ఎన్నికల్లో చింతలపూడి వెంకటరామయ్య విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పల్లా శ్రీనివాస్ గెలుపొందారు. మళ్లీ ఆయనే పోటీ చేయనున్నారు. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేస్తారు. ఆయన 2009, 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. కార్పొరేటర్ గా పనిచేసిన ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపుతో పాటు రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి ఉంది. గాజువాకలో త్రిముఖ పోటీ నెలకొననుంది. ఎక్కువగా కార్మికులు, మధ్యతరగతి ప్రజలు నివసించే ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు కూడా కొంత ఓటు బ్యాంకు ఉంది. మొత్తానికి గాజువాకలో కూడా త్రిముఖ పోటీ తీవ్రంగా ఉండనుంది.