యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రెండు ప్రధాన పార్టీలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న జనసేనకు పరిస్థితులు ఎంతమేరకు అనుకూలంగా ఉన్నాయనే చర్చ మొదలైంది. 2004,2009,2014 పరిస్థితులకు భిన్నంగా దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ప్రస్తుత ఎన్నికల్లో ఒంటరిగా ప్రస్థానిస్తున్నాయి. జనసేన మాత్రమే వామపక్షాలు, బహుజనసమాజ్ పార్టీతో కలిసి కూటమి కట్టి రంగంలోకి దిగుతోంది. ఆయా పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకు చాలా స్వల్పం. అయితే సైకలాజికల్ ప్రభావం మాత్రం గణనీయంగా ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఒక సైద్ధాంతిక భూమికను నిర్మించుకునేందుకు ఈ కూటమి దోహదం చేస్తుందంటున్నారు. లాల్ నీల్ నినాదంతో వామపక్షాలు కార్మిక, దళిత శక్తులను ఏకతాటిపైకి తీసుకురావాలని జాతీయంగా ప్రయత్నించాయి. కానీ బీఎస్పీ వంటి పార్టీలు కలిసిరాకపోవడంతో వ్రుథా ప్రయాసగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో జనాకర్షణ కలిగిన పవన్ కల్యాణ్ ఈ పూనికకు తెలిసో, తెలియకో ఒక వేదికను నిర్మించారు. ఈ ప్రయోగం సక్సెస్ సాధిస్తే జాతీయంగానూ నూతన నిర్మాణానికి ప్రాతిపదిక ఏర్పాటవుతుంది. అందువల్ల ఏపీ ఎక్స్ పెరిమెంట్ ఒక దిక్సూచిగా చెప్పుకోవచ్చు.జనసేన ఒక ప్రయోగం చేస్తోంది. తన సొంతబలంతో పాటు వామపక్షాలు, బీఎస్పీని కలుపుకుని వెళ్లడం ఆ పార్టీకి కలిసివస్తుందా? అంటే కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. వామపక్షాల బలం ఎన్నికల్లో ఎంతమేరకు పనిచేస్తుందనే దానిపై నిర్దిష్టంగా అంచనా వేయడం కష్టం. బీఎస్పీ ని కలుపుకుని వెళ్లడంపై ఇప్పటికే విమర్శలున్నాయి. వైసీపీ ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టడానికే మాయావతితో పవన్ కలుస్తున్నారనే వాదనలున్నాయి. ఈ విమర్శ బలమైన ప్రచారంగా మారితే జనసేనకు ఇబ్బందికరమే. వామపక్షాలు జనసేన బలంగా ఉన్న స్థానాలను కోరి మరీ తీసుకుంటున్నాయి. సొంతబలం కంటే పవన్ అభిమానుల బలం పైనే ఆధారపడుతున్నాయి. మాయావతి చంచల నాయకురాలు. వామపక్షాలు పూటకో పార్టీని మారుస్తున్నాయి. వీటిని నమ్ముకుని సొంతబలాన్ని పణంగా పెట్టడం ఎంతవరకూ మంచిదని పవన్ హితైషులు వాపోతున్నారు.సిద్ధాంత వైఫల్యం, చిత్తశుద్ధి లోపం, నాయకత్వ బలహీనతలతో నానాటికీ క్షీణించిపోతున్నాయి వామపక్షాలు. ఎనిమిదో దశకం వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానప్రతిపక్షాలుగా వామపక్షాలే ఉంటుండేవి. తెలుగుదేశం పార్టీ రంగప్రవేశం తర్వాత తమ ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. శిఖరసదృశంగా , ప్రజాసమస్యలపై అంకితభావం కలిగిన నాయకుల తరమూ నశించింది. వామపక్షం అనే పేరుతో వ్యక్తిస్వార్థం చూసుకునే నాయకుల పెత్తనం పెరిగింది. అధికార యావ ప్రబలిపోయింది. పదవుల కోసం పొత్తుల ఎత్తులు వేసే వెంపర్లాట మొదలైంది. దాంతో వామపక్షాలు ప్రజల్లో పలుకుబడి కోల్పోతూ వచ్చాయి. అయినప్పటికీ గత వైభవం కారణంగా 2004 ఎన్నికల వరకూ మూడు శాతం మేర ఓటు బ్యాంకు వామపక్షాలకు ఉండేది. ఒక దశాబ్దకాలంలో అదంతా క్షీణించిపోయింది. 2014 ఎన్నికల్లో సీపీఐ విభజిత ఆంధ్రప్రదేశ్ లో కేవలం 0.27 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. సీపీఎం 0.38 శాతానికే పరిమితమైంది. ఈసారి ఆ మాత్రం ఓట్లు కూడా లభిస్తాయనే నమ్మకం ఆ పార్టీలకు లోపించింది. ఏదో ఒక పార్టీపై ఆధారపడి మనుగడ సాగించే స్థితికి వామపక్షాలు దిగజారిపోయాయనే చెప్పాలి. ఇప్పుడు పవన్ రూపంలో ఒక జనాకర్షకశక్తి అండ దొరకడంతో వామపక్షాలు ఊపిరిపోసుకోబోతున్నాయనే చెప్పాలి. గెలుపు సంగతి పక్కనపెట్టినా తాము పోటీ చేసే స్థానాల్లో డిపాజిట్లు తెచ్చుకోగలుగుతాయి. ఒకటి రెండు చోట్ల గెలుపుతో అసెంబ్లీలో ప్రాతినిధ్యానికి కూడా అవకాశం దొరికింది.దళిత ప్రజల ఆశాదీపంగా ఆవిర్భవించిన బహుజనసమాజ్ ఆంధ్రప్రదేశ్ లో సైతం తొలిదశలో ఆశలు రేకెత్తించింది. 1980 లలో ప్రతీకాత్మకంగా ఎస్సీ లను సంఘటితపరిచి రాజకీయ బలంగా మారుస్తుందనుకున్న పార్టీ క్రమేపీ బలహీనపడిపోయింది. ఉత్తరభారతంపైనే ప్రధానంగా ద్రుష్టి నిలపడం ఇందుకొక కారణం. అప్పట్లో తెలుగుదేశం పార్టీ కొత్తగా ఆవిర్భవించి అన్నివర్గాల్లోకి చొచ్చుకుని పోవడం కూడా బీఎస్పీ విస్తరణకు అవరోధంగా మారింది. బలమైన పొత్తులు లేకపోవడంతో అసెంబ్లీలో సంఖ్యాపరమైన ప్రాతినిధ్యం దొరకలేదు. 94 ఎన్నికల సందర్భంగా ఎన్టీరామారావు బీఎస్పీ తో పొత్తుకు , సీట్ల పంపిణీకి సిద్ధమైనా ఆ ప్రయత్నం ఫలించలేదు. పార్టీ విస్తరణకు దొరికిన గోల్డెన్ చాన్సును బీఎస్పీ మిస్సయ్యింది. ఇప్పటికీ పార్టీకి కొంత అవకాశం ఉన్నప్పటికీ దానిని అవకాశం గా మలచుకోవడంలో బీఎస్పీ విఫలమవుతోంది. ఇక్కడ స్థిరపడిన ప్రధానప్రాంతీయ పార్టీలు దానితో చేతులు కలపకపోవడంతో నిలదొక్కుకోలేకపోయింది. స్థానికంగా దళితులపట్ల వివక్ష, అసమానతలపై ఉద్యమాలు చేయకపోవడమూ బీఎస్పీ ఎదుగుదలను నిరోధించింది. దీంతో అటు తెలంగాణలో కాంగ్రెసు, ఇటు ఆంధ్రాలో వైసీపీ వైపు ఎస్సీ ఓటు బ్యాంకు మొగ్గుతోందనే భావన ఏర్పడింది. ఇప్పుడు జనసేనతో పొత్తు కారణంగా కొంతమేరకు సొంత ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. భవిష్యత్తులో ఏపీలోనూ విస్తరించడానికి ఒక ప్రాతిపదికను సిద్ధం చేసుకోవచ్చు.