YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సిద్ధా ఎత్తులు...దళపతి చిత్తులు

సిద్ధా ఎత్తులు...దళపతి చిత్తులు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సిద్ధరామయ్య మాజీ అయ్యారని కొట్టిపారేయడానికి వీలులేదు. ఆయన రాజకీయ తంత్రాల్లో ఆరితేరిన నేత. సిద్ధూ ఖాళీగా ఉంటే మరింత రెచ్చిపోతారన్నది ఆయన సన్నిహితుల నుంచి విన్పించే మాట. సిద్ధరామయ్య లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. కర్ణాటకలో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ ఏర్పాటు సిద్ధరామయ్యకు సుతారమూ ఇష్టం లేకపోయినా అధిష్టానానికి వినయ విధేయ రామగా కన్పించాలని ఒప్పుకున్నారు. ఆ తర్వాత సమన్వయ కమిటీ ఛైర్మన్ గా నియమితులై ప్రభుత్వంలో తానే చక్రం తిప్పడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కుమారస్వామికి చుక్కలు చూపిస్తున్నారు.అధికారుల బదిలీల దగ్గర నుంచి మంత్రి పదవుల వరకూ అంతా సిద్ధూ ఇష్టప్రకారమే జరిగింది. ఇక లోక్ సభ ఎన్నికల వేళ కూడా సిద్ధరామయ్య పైచేయి సాధించారనే చెప్పాలి. తనకు రాజకీయ బిక్ష పెట్టిన దళపతి దేవెగౌడను నిలువరించారు. సీట్ల పంపకాల్లో దేవెగౌడ మాట నెగ్గకుండా చేయడంలో సిద్ధరామయ్య విజయం సాధించారనే చెప్పాలి. జనతాదళ్ ఎస్ మొత్తం 12 స్థానాలు కోరితే అందులో కేవలం ఎనిమిది స్థానాలు ఇచ్చేందుకే సిద్ధరామయ్య సిద్ధపడ్డారు. తొలి నుంచి ఆరు స్థానాలే నంటూ సంకేతాలు పంపి చివరకు రెండు పెంచి జేడీఎస్ ను సంతృప్తి పర్చేలా చేయగలిగారు.ఇక సీట్ల పంపకంలో కూడా తనదైన శైలిలో సిద్ధరామయ్య వ్యవహరించారు. మాండ్య సీటును ఖచ్చితంగా జనతాదళ్ ఎస్ కోరుతుందన్నది సిద్ధరామయ్యకు తెలియంది కాదు. అక్కడ అంబరీష్ సతీమణి సుమలత ఉన్నప్పటికీ ఆమెను పక్కనపెట్టి దేవెగౌడ మాటకు తలొగ్గినట్లే కన్పించారు. అయితే జేడీఎస్ కు పట్టున్న మైసూరు ప్రాంతాన్ని తిరిగి తన గుప్పిట్లోకి తెచ్చుకోగలిగారు. మైసూరు ప్రాంతంలో తన పట్టును కోల్పోకుండా సిద్ధరామయ్య జాగ్రత్త పడ్డారు.మైసూరు ప్రాంతం తమకే కావాలని పట్టుబట్టినా సిద్ధరామయ్య ససేమిరా అన్నారు. తనకు ప్రత్యర్థిగా ఉన్న ఉపముఖ్యమత్రి పరమేశ్వర్ కు సంబంధించిన తుముకూరు ప్రాంతాన్ని జేడీఎస్ కు కేటాయించారు. పరమేశ్వర్ కు చెక్ పెట్టేందుకే సిద్ధరామయ్య తుముకూరును జేడీఎస్ కు వదిలిపెట్టారు. రాహుల్ గాంధీ సయితం సిద్ధరామయ్య మాట వినక తప్పలేదు. ఎందుకంటే కర్ణాటకలో స్టార్ క్యాంపెయినర్ సిద్ధరామయ్యే కాబట్టి రాహుల్ కూడా దేవెగౌడ డిమాండ్లను పెద్దగా పట్టించుకోలేదని చెబుతారు. మొత్తం మీద సిద్దరాయమ్య తానేంటో మరోసారి అటు పార్టీ నేతలకు, ఇటు ప్రత్యర్థి అయినా మిత్రుడిగా ఉన్న జేడీఎస్ కు చెప్పకనే చెప్పారు.

Related Posts