యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీపై కేసీఆర్ కక్ష కట్టారని ఆరోపించారు. బుధవారం చింతలపూడిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగించారు. కేసీఆర్ మన ఆస్తులన్నీ లాక్కున్నాడు. ఏపీకి రావాల్సిన నిధులను ఇవ్వలేదు. జగన్‌ను ఓ పావులా వాడుకుంటున్నాడు. అలాంటి జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లే అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో తన కష్టం ఉందన్న చంద్రబాబు.. నవ్యాంధ్రప్రదేశ్‌ని ప్రపంచపటంలో పెడతానని అన్నారు. తెలుగుజాతి కోసం ఎంతో కష్టపడ్డానని అన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అండగా ఉంటారని ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. హామీలు అమలు చేయకుండా కేంద్రం మోసం చేసిందన్నారు. కేంద్రం సహకరించకపోయినా.. కష్టపడి పెట్టుబడులు తీసుకువచ్చానని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నానని వివరించారు. ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. మీ భవిష్యత్ నా బాధ్యత గా పనిచేస్తున్నానని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పెంచానన్నారు.తాను ఒక రైతు బిడ్డనని, రైతులకు రూ.24వేల కోట్లు రుణమాఫీ చేశామని చంద్రబాబు వివరించారు. రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ ఖరీఫ్ నుంచే కౌలు రైతులకు పథకాన్ని అమలు చేస్తామన్నారు. రుణమాఫీ సాధ్యం కాదని ప్రతిపక్ష నేత జగన్ అంటే.. తాము సాధ్యం చేసి చూపామన్నారు. జగన్‌కు ప్రజా సేవ చేయడం తెలియదని విమర్శించారు.
ఏపీని స్టడీహబ్‌గా తీర్చిదిద్దానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికాలో ఎంతోమంది తెలుగువాళ్లు రాణిస్తున్నారని గుర్తుచేశారు. మెరుగైన విద్య కోసం విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం భోజనంలో కోడిగుడ్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పిల్లలందరినీ సొంత పిల్లల్లా చూసుకుంటానని సీఎం చెప్పారు. నిరుద్యోగ యువకులకు భృతి ఇస్తున్నామని వివరించారు. అదేవిధంగా నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యువకులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇదే సమయంలోపై జగన్ విద్యార్హతపైనా విమర్శలు సంధించారు. జగన్ ఏమైనా చదువుకున్నారా అని ప్రశ్నించారు. ఎక్కడ చదువుకున్నాడో కూడా జగన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. మాటలు చెప్పేవాళ్లు పనులు చేయలేరన్నారు. జగన్ చేస్తున్న తప్పుడు రాజకీయాలను తీవ్రంగా ఖండించామని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీకి రాకుండానే వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకున్నారని విమర్శించారు. మోదీకి భయపడే వైసీపీ నేతలు పార్లమెంట్‌కు వెళ్లలేదని నిప్పులు చెరిగారు.
బిహార్ నుంచి వచ్చిన ఓ డెకాయిట్ ఇక్కడి ప్రజల ఓట్లు తీసేయించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రతి విషయాన్ని జగన్ రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వివేకానంద రెడ్డి హత్యలో జగన్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చంద్రబాబు ఆరోపించారు. చనిపోయిన వివేకానంద రెడ్డికి జగన్ మామ కట్టు కట్టారని మృతదేహానికి ఎవరైనా బ్యాండేజ్ కడతారా అని ప్రశ్నించారు. జగన్‌కు తెలంగాణ పోలీసులు ముద్దు.. ఏపీ పోలీసులు వద్దు అని విమర్శించారు. తెలంగాణ పోలీసులు బాగుంటే జగన్ అక్కడే ఉండాలని చురకలంటించారు. ఇదే సమయంలో కేసీఆర్‌పైనా నిప్పులు చెరిగిన చంద్రబాబు.. కేసీఆర్ నోటికొచ్చినట్లు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరంపై కేసీఆర్ సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు. తనది ఉడుం పట్టు అని, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా అభివృద్ధిని వదిలిపెట్టేది లేదని సీఎం స్పష్టం చేశారు. జగన్‌కు ఓటేస్తే.. మన మరణశాసనం మనమే రాసుకున్నట్లు అని వ్యాఖ్యానించారు.