YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సర్వేలు నిజమౌతాయా... బలమైన అభ్యర్ధులతో రంగంలోకి టీడీపీ

సర్వేలు నిజమౌతాయా... బలమైన అభ్యర్ధులతో రంగంలోకి టీడీపీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని అన్ని జాతీయ సంస్థల సర్వేలు అంచనా వేస్తున్నాయి. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో 23 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని ఇండియా టీవీ సంస్థ సర్వే చెప్పగా, తాజాగా వైసీపీ 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ సంస్థ అంచనా వేసింది. మరికొన్ని సర్వే సంస్థలు కూడా ఇంచుమించు ఇవే ఫలితాలు వస్తాయని చెబుతున్నాయి. 20కి పైగా పార్లమెంటు స్థానాలను వైసీపీ గెలుచుకుని స్వీప్ చేస్తుందని చెబుతున్నాయి. అయితే, అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ సంస్థలు చెబుతున్న సర్వేలు నిజమవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నుంచి ఎక్కువగా సాధారణ, రాజకీయాలకు కొత్త అభ్యర్థులను బరిలో నిలపగా తెలుగుదేశం పార్టీ మాత్రం హేమాహేమీల్లాంటి అభ్యర్థులను పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిపింది. దీంతో ఈ సర్వేలు ఏమేర నిజమవుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.అనంతపురం జిల్లాలోని అనంతపురం పార్లమెంటు నుంచి రాజకీయాలకు కొత్త అయిన, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి పీడీ రంగయ్య వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి ఆయనపై జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇదే జిల్లాలోని మరో నియోజకవర్గం హిందూపురం నుంచి వైసీపీ తరపున మాజీ సీఐ గోరంట్ల కేశవ్ కు టిక్కెట్ ఇచ్చారు. ఆయనపై టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత నిమ్మల కిష్టప్ప పోటీ చేస్తున్నారు. రాజకీయంగా వైసీపీ అభ్యర్థుల కంటే టీడీపీ అభ్యర్థులు బలమైన వారు. ఇక, కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు సమాన స్థాయి ఉన్నారు. గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంటు స్థానానికి వైసీపీ తరపున సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు నందిగం సురేష్ ను పోటీలో నిలిపారు. ఆయనపై టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రి పోటీలో ఉన్నారు. నరసరావుపేట నుంచి వైసీపీ తరపున యువకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలో ఉన్నారు. ఆయన రాజకీయాలకు కొత్త. ఆయనపై జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంభశివరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల కంటే రాజకీయంగా ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అనుభవజ్ఞులు, బలవంతులుగా కనిపిస్తున్నారు.విజయవాడలో టీడీపీ తరపున సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత కేశినేని నాని పోటీ చేస్తున్నారు. ఆయనపై వైసీపీ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈయన ఆర్థికంగా బలంగానే ఉన్నా రాజకీయాలకు కొత్త. ఏలూరులో సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు టీడీపీ నుంచి మరోసారి పోటీలో ఉన్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి కొత్త అయిన కోటగిరి శ్రీధర్ పోటీ చేస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచే వచ్చినా కోటగిరి శ్రీధర్ పోటీ చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఇద్దరు వైసీపీ కొత్త అభ్యర్థులు తలపండిన టీడీపీ అభ్యర్థులను ఢీకొట్టగలరా అనే అనుమానాలు వస్తున్నాయి. అమలాపురం పార్లమెంటుకు వైసీపీ నుంచి మాజీ ఇన్ కం ట్యాక్స్ అధికారిని చింతా అనురాధ పోటీ చేస్తున్నారు. ఆమె రాజకీయాలకు కొత్త. ఆమెపై టీడీపీ నుంచి మాజీ స్పీకర్, ఈ ప్రాంతంలో మంచి గుర్తింపు ఉన్న బాలయోగి కుమారుడు హరీష్ పోటీ చేస్తున్నారు. అరకు పార్లమెంటు నుంచి వైసీపీ తరపున గిరిజన పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న గొడేటి మాధవి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి మాజీ కేంద్రమంత్రి, రాజ్యవంశస్థుడు, ఈ ప్రాంతంలో బాగా గుర్తింపు ఉన్న కిషోర్ చంద్రదేవ్ బరిలో ఉన్నారు.విశాఖపట్నం నుంచి వైసీపీ తరపున వ్యాపారవేత్త ఎంవీవీ సత్యనారాయణ పోటీలో ఉన్నారు. రాజకీయాలకు ఆయన కొత్త. ఆయనపై టీడీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. ఈయన రాజకీయాలకు కొత్తే అయినా ఆయన తాత ఎంవీవీఎస్ మూర్తికి ఈ ప్రాంతంలో మంచి గుర్తింపు ఉంది. బాలకృష్ణ అల్లుడు కావడం కూడా ఆయనకు మేలు చేసే అవకాశం ఉంది. ఇక, విజయనగరం నుంచి టీడీపీ తరపున రాజకీయ దిగ్గజం, మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి రాజు పోటీ చేస్తుండగా వైసీపీ తరపున బెల్లాని చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. చంద్రశేఖర్ కింది స్థాయి నుంచి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి. కానీ, అశోకగజపతి రాజుతో పోలిస్తే బలహీనంగా కనిపిస్తున్నారు. శ్రీకాకుళంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు పోటీలో ఉన్నారు. ఆయనకు కుటుంబ నేపథ్యం ఆయనకు అండగా ఉంది. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. ఆయనకు రాజకీయంగా పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేదు. స్వంతంగా కిందిస్థాయి నుంచి ఎదిగారు. ఇలా పదికి పైగా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున బలమైన అభ్యర్థులు బరిలో ఉండగా వైసీపీ తరపున రాజకీయాలకు కొత్త వారు, సామాన్య నాయకులు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారు పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో జాతీయ ఛానల్స్ చెప్పే విధంగా 20కి పైగా ఎంపీ స్థానాలను వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఏ మేర ఉన్నాయో చూడాలి.

Related Posts