YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంగళగిరి బరిలో నువ్వా, నేనా

మంగళగిరి బరిలో నువ్వా, నేనా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మంగళగిరి….నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పరిధిలో ఉన్న ప్రాంతం…ఇక టీడీపీ ఇక్కడ 1983, 85లలో తప్ప మళ్ళీ గెలిచిన దాఖలాలు లేవు. ఆ తర్వాత కూడా ఈ సీటు పొత్తులో భాగంగా సీపీఎం, బీజీపీ పార్టీలకి ఇచ్చిందే తప్ప… టీడీపీ పోటీ చేయలేదు. అయితే గత 2014 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. కానీ వైసీపీ విజయం సాధించింది. కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ళ రామకృష్ణా రెడ్డి..గంజి చిరంజీవిపై విజయం సాధించారు. ఇక తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి అయింది. అందులో మంగళగిరి కూడా వచ్చి చేరింది. దీంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కొంత పుంతలు తొక్కింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ అయ్యి మంత్రిగా చేస్తున్న నారా లోకేశ్ ఈ సారి మంగళగిరి బరిలోకి దిగుతున్నారు. అయితే రాష్ట్రంలో టీడీపీ కంచుకోట ప్రాంతాలు చాలా ఉన్నా లోకేశ్ ఇక్కడ పోటీ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. మంగళగిరి కేంద్రంగా ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు లోకేశ్ ఎంతగానో కృషి చేస్తున్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు… ఐటీ పరిశ్రమలు మంగళగిరికి రావడంలో లోకేశ్ పాత్ర కీలకమనే చెప్పాలి.కానీ 83, 85లో తప్ప మళ్ళీ టీడీపీ గెలవని ఈ ప్రాంతంలో లోకేశ్ పోటీకి దిగడం సాహసమనే చెప్పాలి. అయితే గత ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గెలిపిస్తాయని చంద్రబాబు ఆలోచించి ఇక్కడ లోకేశ్‌ని దించారు. మరోవైపు వైసీపీ తరపున మరోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉండటం కూడా లోకేశ్‌కు కలిసొచ్చే అంశమని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఆళ్లకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని టీడీపీ సర్వేలో తేలింది. అటు వైసీపీ కూడా ఆళ్ళకి టికెట్ ఇవ్వడానికి కొన్ని రోజులు సందిగ్దంలో పడి…మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు. నియోజకవర్గంలో వైసీపీ కి క్యాడర్ ఉండటం..రాష్ట్రంలో వైసీపీకి పెరిగిన బలం తనని గెలిపిస్తాయని ఆళ్ళ ధీమాతో ఉన్నారు.అటు టికెట్ కేటాయించిన వెంటనే లోకేష్ రంగంలోకి దిగి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన గంజి చిరంజీవితో భేటీ అయ్యారు. తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వాల్సిందిగా కోరారు. స్థానిక నాయకులతో సమావేశాలు జరుపుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రజలని ఓట్లు అడుగుతున్నారు. ఇక మంత్రిగా చేసిన అభివృద్ధి…సీఎం తనయుడు కావడం లోకేశ్ కలిసొచ్చే అంశం. కానీ టీడీపీ ఇక్కడ ఎక్కువ గెలిచిన రికార్డు లేకపోవడం..ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉండటం మైనస్. అలాగే ఇక్కడ కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటం జనసేనకి కలిసొచ్చే అవకాశం ఉంది. గతంలోనూ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో ఈ విషయం రుజువైంది. ప్రజారాజ్యం అభ్యర్ధికి ఇక్కడ 40వేల ఓట్ల వరకు వచ్చాయి. జనసేన పార్టీ నుండి గట్టి అభ్యర్థి బరిలోకి దించితే ఈ సారీ ముక్కోణపు పోటీ తప్పదు. లోకేశ్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటుతారో…లేక ఆళ్ళ మళ్ళీ గెలుస్తారో? చూడాలి. కాగా, ఈ నియోజకవర్గంలో పద్మశాలీయులు ఓటర్లు కీలకం కానున్నారు. వీరు 35వేలు వరకు ఉన్నారు. ఆ తర్వాత మాదిగలు- 28వేలు, మాలలు- 25వేలు, కాపులు- 24వేలు ఉన్నారు. అలాగే రెడ్లు, కమ్మ , యాదవులు, గౌడ, ముస్లీంలు కూడా గెలుపోటములని ప్రభావితం చేస్తారు.

Related Posts