మొదటిసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించిన పార్టీ పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక అయితే మేలేని నిర్ణయించింది. దీంతో ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అయితే, పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్వస్థలం మొగల్తూరు భీమవరం సమీపంలోనే ఉంది. పవన్ కళ్యాణ్ భీమవరంలో కొన్ని రోజులు విద్యాభ్యాసం చేశారు. ఆయనకు ఇక్కడ చాలామంది సన్నిహితులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పట్టణం కావడం కూడా ఆయన భీమవరం ఎంపిక చేసుకోవడానికి కారణం. జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు కూడా భీమవరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సుమారు వారం రోజుల పాటు ఆయన ఇక్కడే బస చేశారు.దీంతో పవన్ భీమవరం వైపు మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా పక్కనే ఉన్న పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని పార్టీ భావిస్తోంది. ఇక, ఇక్కడ పవన్ స్వంత కాపు సామాజకవర్గం ఓట్లు సుమారు 60 వేల వరకు ఉన్నారని అంచనా ఉండటంతో పవన్ విజయం సులువవుతుందని పార్టీ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ ద్వారా ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు పోటీలో ఉన్నారు. ఆయన కాపు సామాజకవర్గానికి చెందిన నేత. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంధి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఆయన 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.వరుసగా రెండుసార్లు ఓడిపోయినందున గ్రంధి శ్రీనివాస్ పై ప్రజల్లో సానుభూతి ఉంది. టీడీపీలో ఉన్న విభేదాలు సైతం ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంది. గ్రంధి శ్రీనివాస్ కూడా కాపు సామాజకవర్గానికి చెందిన నాయకులే. దీంతో ముగ్గురూ ఒకే సామాజకవర్గం నేతల మధ్య పోటీ ఉంది. అయితే, వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ కు వైసీపీ అధినేత జగన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారంట. వైసీపీ అధికారంలోకి వచ్చిన భీమవరం నుంచి గ్రంధీ శ్రీనివాస్ గెలిచి వస్తే ఆయనకు కీలక మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారంట. దీంతో గ్రంధి శ్రీనివాస్ రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. విజయం కోసం ఆయన బాగానే కష్టపడుతున్నారు. మరి, పవన్ కళ్యాణ్ ఓడించి ఆ కీలక మంత్రి పదవిని గ్రంధి శ్రీనివాస్ దక్కించుకుంటారో లేదో చూడాలి.