YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ కు కాపు కాస్తారా...

పవన్ కు కాపు కాస్తారా...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

రాజకీయాల్లో అగ్రనేతలు రెండు ప్రాంతాలనుంచి పోటీ చేయడం కొత్తేమీ కాదు. పార్టీ అధినేతలపై ప్రధానంగా ప్రత్యర్ధులు దృష్టి పెట్టి వారిని ఓడించేందుకు కృషి చేస్తారనే ఈ తరహా వ్యూహాత్మక నిర్ణయాలను అంతా అనుసరిస్తూ వుంటారు. గతంలో ఎన్టీఆర్ కూడా ఇలా రెండు స్థానాల నుంచి పోటీకి దిగి ఒక దాంట్లో గెలిచి మరోదాంట్లో ఓడిపోయారు. మెగాస్టార్ చిరంజీవి సైతం అదేవిధంగా పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేసి తన సొంత ఊర్లో ఓటమి పాలయి తిరుపతిలో గెలిచి పరువు నిలుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ సైతం వ్యూహాత్మకంగా రెండు స్థానాలనుంచి పోటీ చేసేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశం అయ్యింది.వెనుకబడ్డ రాయలసీమ లోని అనంతపురం జిల్లా నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రకటించి అక్కడ అనుకూల వాతావరణం లేదని సర్వేల్లో తేలడంతో వెనక్కి తగ్గారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా వున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ గాజువాక సేఫ్ ప్లేస్ లుగా గుర్తించడంతో పోటీకి సై అనడం విశేషం. ఒక చోట పరాజయం పాలైనా మరోచోట గెలుస్తామన్న లెక్కల్లోనే పవన్ ఈ అడుగు వేసినట్లు తెలుస్తుంది. తనను టార్గెట్ చేసి ప్రత్యర్ధులు ఓడిస్తారన్న భయం వల్లే ఆయన రెండు ప్రాంతాలు నుంచి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం మొదలైంది. ఉత్తరాంధ్ర, మరో పక్క ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ లో జోష్ పెంచేందుకు జనసేనాని రెండు స్థానాల్లో బరిలోకి దిగినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.తనకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదని నిత్యం చెప్పే జనసేనాని కాపు సామాజిక వర్గీయులు అత్యధికంగా వున్న నియోజకవర్గాలనుంచి బరిలోకి దిగడం సోషల్ మీడియా లో చర్చకు దారీ తీసింది. వెనుకబడ్డ రాయలసీమ నుంచి ఆయన ఎందుకు బరిలోకి దిగడం లేదని ఆయన ప్రత్యర్ధులు అప్పుడే మొదలు పెట్టేశారు కూడా. సామాజిక వర్గాల సమీకరణాలు చూసుకుని పవర్ స్టార్ వంటి వారు తమ సామాజిక వర్గీయులు అధికంగా వున్న చోటే పోటీ చేస్తుండటంతో ఆయన సైతం అన్ని పార్టీల నేతల్లాగే వ్యవహరించారన్న విమర్శలు మూటగట్టుకోవాలిసి వచ్చింది.దీనికి తోడు ప్రజాస్వామ్య వాదులు రెండు చోట్ల నేతలు పోటీ చేయడాన్ని తప్పు పడుతున్నారు. ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ పదేపదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేసే పవన్ రెండు చోట్ల గెలిస్తే ఒక స్థానంలో తిరిగి ఎన్నికలు వచ్చి ప్రజాధనం వృథాకు కారకుడు కాదా అన్న చర్చ నెటిజెన్స్ లో మొదలైంది. ఆయన రెండు చోట్ల గెలిస్తే ఏ స్థానం వదులు కుంటారో స్పష్టం చేసి ఓటు అడగాలి అన్న డిమాండ్లు పబ్లిక్ నుంచి ప్రత్యర్థి పార్టీల నుంచి పెరుగుతూ ఉండటం గమనార్హం. మరి దీనికి జనసేనాని ఎలా బదులు ఇవ్వనున్నారో వేచి చూడాలి.

Related Posts