యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైసీపీలో అభ్యర్ధులందరినీ జగన్ ఒకేసారి ప్రకటించేశారు. ఆ జాబితా చూస్తూంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇద్దరు మాజీ మంత్రుల హవా స్పష్టంగా కనిపించింది. విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ ఆ జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్లు తన వారికే ఇప్పించేసుకున్నారు. జగన్ స్వయంగా ఎంపిక చేసింది ఒక్క కోలగట్ల వీరభద్రస్వామికే. జగన్ పాదయాత్ర సందర్భంగా విజయనగరంలో ప్రకటించారు. ఇక సిట్టింగులైన కురుపాం, సాలూరు ఎమ్మెల్యేలు శ్రీవాణి, రాజన్నదొరలకు ఎటూ టికెట్లు ప్రకటించారు. మిగిలిన సీట్లు మాత్రం బొత్స ఎలా అనుకున్నారో అలాగే జగన్ ఇవ్వడం విశేషం.బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి పోటీ చేస్తుంటే ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం నుంచి పోటీలో ఉన్నారు. ఇక ఆయన మేనల్లుడు బండికొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి టికెట్ దక్కించుకున్నారు. అలాగే దగ్గర చుట్టం బెల్లాల చంద్రశేఖర్ విజయనగరం ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. అదే విధంగా బొత్స వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడుకు బొబ్బిలి టికెట్ ఇచ్చారు. మరో అనుచరుడు అలజంగి జోగారావుకు పార్వతీపురం టికెట్ ఇచ్చేఅశారు. ఈ విధంగా మొత్తం తొమ్మిది సీట్లకు గాను అరడజన్ అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు బొత్స తన వర్గానికి దక్కించుకుని జగన్ వంటి నేత చేతనే ఒకే అనిపించేశారు. అంతే కాదు విశాఖ జిల్లాలో అనకాపల్లి ఎమ్మెల్యే సీటు కూడా బొత్స చలువతోనే గుడివాడ అమర్నాధ్ దక్కుంచుకున్నరంటే బొత్స ఎక్కడా తగ్గలేదని అర్ధమవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో చూసినపుడు అక్కడ ధర్మాన బ్రదర్స్ తమ హవా చాటుకున్నారు. శ్రీకాకుళం , నరసన్నపేట టికెట్లు ఈ ఇద్దరు తీసుకున్నారు. టెక్కలి నుంచి పేడాడ తిలక్, శ్రీకాకుళం ఎంపీ టికెట్ దువ్వాడ శ్రీనివాస్ లకు వీరి కోటాలోనే దక్కింది. ఇక్కడ నుంచి తనకు అవకాశం ఇవ్వమని కేంద్ర మాజీ మంత్రి కిల్లి క్రుపారాణి కోరినా ధర్మాన ప్రసాదరావు జగన్ వద్ద తన పలుకుబడి ఉపయోగించి చెక్ పెట్టేయగలిగారు. అదే విధంగా పలాసా, ఇచ్చాపురం సీట్ల విషయంలోనూ ధర్మాన కుటుంబం మాటే చెల్లుబాటు అయింది. టికెట్లు తెచ్చుకోవడం వరకూ ఒకే అయినా మాజీ మంత్రులు ఇద్దరూ రెండు జిల్లాలో ఎన్ని సీట్లు వైసీపీకి తెస్తారో చూడాలి