యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: తమిళనాడులో నాడు శాసించిన నేతలు ఇప్పుడు లేరు. జయలలిత మరణం తర్వాత అధికార అన్నాడీఎంకే నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అధికారంలో ఉంది కాబట్టి ఆ మాత్రమైనా క్యాడర్ ఉందన్నది వాస్తవం. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే కు శశికళ నాయకత్వం వహించారు. అయితే ఆమె అనూహ్యంగా జైలు కెళ్లడంతో ముఖ్యమంత్రిగా పళనిస్వామి తెరమీదకు తెచ్చారు. తన నమ్మినబంటు అని శశికళ పళనికి పగ్గాలు అప్పగిస్తే అనతికాలంలోనే కేంద్రంతో చేతులు కలిపి శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి విజయవంతంగా బయటకు నెట్టగలిగారు. తమిళనాడులో 40 లోక్ సభ స్థానాలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేక అధికార అన్నాడీఎంకే పొత్తులతో ముందుకు వెళుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో జత కట్టింది. ఇందులో ఎవరూ తప్పు పట్టడానికి వీలులేదు. గతంలోనూ జయలలిత బీజేపీకి మద్దతిచ్చిన వారే కావడంతో ధైర్యంగా పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు కమలం పార్టీతో కలసి ముందుకు వెళుతున్నారు. చిన్నా చితకా పార్టీలను కలుపుకుని పైకి కూటమి బలంగానే కన్పిస్తున్నప్పటికీ అధికార పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటుదన్నది వాస్తవం.పళనిస్వామి జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఆయనకు పెద్దగా ప్రజల్లో ఇమేజ్.. క్రేజ్ రెండూ లేవు. రెండేళ్ల నుంచి పాలనను ఏదో ఒకలా నెట్టుకొస్తున్నారు. పన్నీర్ సెల్వం కూడా కలవడంతో ఆయనకు ప్రభుత్వాన్ని నడపటం పెద్దగా కష్టం కాకపోయినా ఈ ఎన్నికలు మాత్రం సవాల్ గా మారాయి. ఎందుకంటే పళనిస్వామి ఒక ప్రాంతానికి చెందిన నేత. బీసీ నేత అయినప్పటికీ ఆ వర్గాల్లో పెద్దగా ప్రభావం చూపలేని స్థిితి. సభలు, సమావేశాల్లోనూ ఆకట్టుకునే విధంగా కూడా మాట్లాడలేని నేత. పళనిస్వామి వల్ల పెద్దగా ఈ ఎన్నికల్లో ఉపయోగం ఉండదన్నది విశ్లేషకుల అంచనా.మరోనేత ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా సేమ్ టు సేమ్. జయలలితకు నమ్మినబంటుగా ముద్రపడిన పన్నీర్ సెల్వానికి కొంత సానుభూతి అయితే ఉంది. ఆయనకు జయలలిత ఆశీస్సులు ఉన్నాయని జనం ఇప్పటికీ నమ్ముతారు. అయితే జనాన్ని ఆకర్షించగలిగిన నేత కాదు. జయ నీడలా ఉన్నారు తప్ప… పార్టీలోనూ పెద్దగా పట్టు లేదు. దీంతో ఈ ఇద్దరు నేతలు ఈ ఎన్నికల్లో మోదీపైనే ఆధారపడుతున్నారు. మోదీ ఇమేజ్, ప్రసంగాలు తమను గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు. ఈ ఇద్దరి నేతల వల్ల ఏమీ కాదన్నది పార్టీ నేతలకూ తెలియంది కాదు. అయితే మరో రెండేళ్లు పవర్ లో ఉండే అవకాశముండటంతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఇద్దరి అసలు స్వరూపం బయపడే అవకాశముంది.