యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ నగరపాలక సంస్థ జోన్-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పవన్ తన పేరిట ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తన పేరిట రూ.12.79 కోట్ల విలువైన చరాస్థులు ఉన్నాయని జనసేనాని తెలిపారు. రూ.40 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో తనకు రూ.32.40 కోట్లకు పైగా బాకీలు ఉన్నాయని పవన్ తెలిపారు.తనకు అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర రూ.2.40 కోట్ల మేర అప్పు తీసుకున్నానని పవన్ తెలిపారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ దగ్గర రూ. 1.25 కోట్లను రుణంగా తీసుకున్నానన్నారు. తన వదిన సురేఖ దగ్గర రూ.1.07 లక్షల ఆస్తులు తీసుకున్నానని జనసేనాని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.ఎం.ప్రవీణ్ కుమార్‌కు రూ.3 కోట్లు, ఎంవీఆర్ఎస్ ప్రసాద్‌కు రూ.2 కోట్లు, శ్రీ బాలాజీ సినీ మీడియాకు రూ.2 కోట్లు, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాలయకు రూ.27.55 లక్షలు ఇవ్వాల్సి ఉందని పవన్ తెలిపారు. వీటిలో చాలా వరకు సినిమాలకు అడ్వాన్స్‌ల కింద తీసుకున్నవేనని భావిస్తున్నారు.