యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేనలోకి పరుచూరి భాస్కరరావు చేరిపోయారు. ఈయన మంత్రి గంటా శ్రీనివాసరావుకు సన్నిహిత చుట్టం. ఓ సంధర్భంలో మంత్రి గంటా పార్టీలోకి వస్తానంటే తానే తీసుకోలేదని చెప్పిన పవన్ ఇపుడు హఠాత్తుగా పరుచూరికి పార్టీ తీర్ధం ఇవ్వడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. నిజానికి పరుచూరి, మంత్రి గంటాలది విడదీయరాని బంధం. పాతికేళ్ళ పాటు ఇద్దరూ విశాఖలోనే వ్యాపారాలు, రాజకీయాలు కలసి చేశారు. రెండేళ్ళ క్రితమే పరుచూరి మంత్రి నుండి వేరు పడి సొంత రాజకీయం మొదలెట్టారు.మొదట్లో పరుచూరి వైసెపీలోకి వద్దామనుకున్నారు. అయితే అది కుదరలేదు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ మధ్యన మాజీ సీఎమ్ కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న పరుచూరి ఇపుడు జనసేన వైపు రావడం ఆసక్తి కలిగించే పరిణామమే. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పరుచూరి ప్రకాశం జిల్లాకు చెందిన వారు. ఆయన నాన్ లోకల్, మరి అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. అర్ధబలం, అంగబలం దండిగా ఉన్న పరుచూరి మీద అవినీతి మరకలు బోలెడు ఉన్నాయి.అటువంటి పరుచూరిని నిత్యం నీతి పాఠాలు వల్లించే పవన్ ఎలా చేరదీసి పోటీ చేయిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. ఇదిలా ఉండగా గంటా ప్రజారాజంలో ఎమ్మెల్యేగా ఉనపుడు ఆయన తరఫున అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జిగా పరుచూరి పనిచేశారు. ఆ పరిచయాలే తనకు ఉపయోగపడతాయని భావించి ఆయన ఎమ్మెల్యేగా పోటీకి దిగుతున్నారని అంటున్నారు. ఇక మంత్రితో బయటకు విభేదించినట్లుగా కనిపిస్తున్నా లోపల మాత్రం స్నేహం అలాగే ఉందని, అందువల్లనే పరుచూరికి జనసేనలో టికెట్ దక్కిందని అంటున్నారు. గంటాకు మెగా కుటుంబంతో ఉన్న పరిచయాలు అందరికీ తెలిసిందే. పవన్ సైతం గంటాను తీసుకోకపోయినా ఆయన అనుచరునికి టికెట్ ఇచ్చి మెగాభిమానాన్ని చాటుకున్నారని అంటున్నారు.