YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పాల్గొనే అంద‌రికీ పోస్ట‌ల్ బ్యాలెట్ల పంపిణీ

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పాల్గొనే అంద‌రికీ పోస్ట‌ల్ బ్యాలెట్ల పంపిణీ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఏప్రిల్ 11న జ‌రుగ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పాల్గొనే అధికారులు, సిబ్బంది అంద‌రికి పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్టు జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ తెలిపారు. కేవ‌లం ఎన్నిక‌ల సిబ్బంది, అధికారుల‌కే కాకుండా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పాల్గొనే ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, డ్రైవ‌ర్లు, వాలెంటీర్లు, వెబ్‌కాస్టింగ్‌, దివ్యాంగ ఓట‌ర్ల స‌హాయ‌కారిగా ఉండే వాలెంటీర్ల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యం క‌ల్పిస్తున్నామ‌ని వివ‌రించారు. ఎన్నిక‌ల ఏర్పాట్ల‌పై జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో నోడ‌ల్ అధికారుల స‌మావేశాన్ని నేడు నిర్వ‌హించారు. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు హ‌రిచంద‌న‌, అద్వైత్‌కుమార్ సింగ్‌, సిక్తా ప‌ట్నాయ‌క్, సందీప్‌జా, కెన‌డి, విజ‌య‌ల‌క్ష్మి, విజిలెన్స్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, ఎస్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి త‌దిత‌రులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ప్ర‌త్యక్షంగా 20వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నార‌ని, వీరంద‌రికీ పోస్ట‌ల్ బ్యాలెట్‌లు అందించే కార్య‌క్ర‌మం పురోగ‌తిలో ఉంద‌నితెలిపారు. వీటితో పాటు ప‌రోక్షంగా పాల్గొనే జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు వెబ్‌కాస్టింగ్‌, బి.ఎల్‌.ఓల‌కు కూడా ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్టు తెలిపారు. పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని ఉప‌యోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉద్యోగులంద‌రికీ ఎస్‌.ఎం.ఎస్‌లు పంపిస్తున్నామ‌ని, ఎన్నిక‌ల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జ‌రిగే కేంద్రాల వ‌ద్ద ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌ను ఏర్పాటుచేసి పోస్ట‌ల్ బ్యాలెట్లు అందిస్తున్నామ‌ని వివ‌రించారు. పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యంపై ప్ర‌త్యేక కాల్ సెంట‌ర్‌ను కూడా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించ‌డానికి చేప‌ట్టిన చైత‌న్య కార్య‌క్ర‌మాల్లో భాగంగా 1250 చునావ్ పాఠ‌శాల‌లు నిర్వ‌హించామ‌ని, 15 క‌ళాశాల‌లో ఓట‌రు, ఈవీఎం, వివిప్యాట్‌, సి-విజిల్ ల‌పై చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని వివ‌రించారు. హైద‌రాబాద్ జిల్లాలో 24వేల మంది విక‌లాంగుల పింఛ‌న్లు పొందుతుండ‌గా, వీరిలో 19,326మందిని ఓట‌ర్లుగా న‌మోదు చేయించామ‌ని వివ‌రించారు. ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌ను నిరోదించ‌డానికి 126 ఎస్‌.ఎఫ్‌.టి, ఎస్‌.ఎస్‌.టి టీమ్‌ల‌తో పాటు 28 ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి అమ‌లు బృందాల‌ను ప్ర‌త్యేకంగా నియ‌మించిన‌ట్టు తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో 16వేల‌కు పైగా అక్ర‌మ పోస్ట‌ర్లు, ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు తొల‌గించామ‌ని, రూ. 3.52 ల‌క్ష‌ల విలువైన 1,676 లీట‌ర్ల అక్ర‌మ మ‌ద్యంను స్వాధీన‌ప‌ర్చుకున్నామ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 646 పోలింగ్ కేంద్రాల‌లో ర్యాంప్‌ల నిర్మాణం ఏప్రిల్ 2వ తేదీలోగా పూర్తిచేయ‌నున్న‌ట్టు దాన‌కిషోర్ తెలిపారు. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఒక మోడ‌ల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుత వేస‌వి దృష్ట్యా అవ‌స‌ర‌మైన పోలింగ్ కేంద్రాల్లో ఎండ నుండి ఉప‌శ‌మ‌నానికి వీలుగా టెంట్‌ల‌ను ఏర్పాటుచేసి మంచినీటి సౌక‌ర్యం క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో ఓ.ఆర్‌.ఎస్ ప్యాకెట్ల‌ను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీలోగా అన్ని స్ట్రాంగ్ రూమ్‌ల‌ను సిద్దంగా చేసి 26వ తేదీన ఈవీఎంల‌ను ఆయా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంప‌నున్న‌ట్టు  తెలిపారు. ఎన్నిక‌ల సిబ్బందికి ఈ నెల 24వ తేదీలోగా అన్ని ర‌కాల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు పూర్తిచేయ‌నున్న‌ట్టు తెలిపారు. 26వ తేదీన పి.ఓ, ఏ.పి.ఓల రెండ‌వ ర్యాండ‌మైజేష‌న్ చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. 26వ తేదీన ఈవీఎంల తొలి ర్యాండ‌మైజేష‌న్‌ను చేప‌ట్టి అదే రోజు రాజ‌కీయ పార్టీల స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు జిల్లా ఎన్నిక‌ల అధికారి వివ‌రించారు. ప్ర‌తి లోక్‌స‌భ స్థానానికి ఇద్ద‌రు కేంద్ర ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు, ఒక సాధార‌ణ ప‌రిశీల‌కుల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం నియ‌మించింద‌ని వెల్ల‌డించారు. 

Related Posts