టీడీపీ అభ్యర్థులకు రెబల్స్ గుబులు పట్టుకుంది. టీడీపీ తరఫున టిక్కెట్ ఆశించి భంగపడిన ఆశావహులు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నారు. టీడీపీ ఓటమే తమ లక్ష్యమని ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలతో బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థులంతా ఆందోళనతో చెందుతున్నారు. కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే ‘ఉన్నం’ ఇప్పటికే ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. దుర్గంలో కాలవకు పోటీగా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి నామినేషన్ వేశారు. గత ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించి కాలవను గెలిపించిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంతలోనే దీపక్‌రెడ్డి గురువారం ఓ సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే కాలవ బరిలో ఉన్నారు.పైగా కాలవను ఓడించడమే ధ్యేయమని ఇప్పటికే ఆయన ప్రకటించారు. దీంతో మంత్రి కాలవ వెన్నులో వణుకుపుడుతోంది. రాయదుర్గం నుంచి బరిలో ఉన్న మంత్రి కాలవ శ్రీనివాసులుకు దెబ్బమీద దెబ్బ పడుతోంది.దీపక్‌రెడ్డి నామినేషన్ వేయడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రెండేళ్లుగా కాలవను దీపక్‌రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాలవకు టిక్కెట్ రాకుండా తాను బరిలో ఉండాలని యత్నించారు. టీడీపీ అధిష్టానం కాలవకు టిక్కెట్ ఇస్తే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిస్తానని చెప్పారు. అయితే అధిష్టానం సర్దుబాటు చేస్తుందని అంతా భావించారు. అయినప్పటికీ దీపక్ మాత్రం నామినేషన్ వేశారు. కళ్యాణదుర్గంలో నియోజకవర్గంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ తరఫున ఉషాశ్రీ చరణ్, కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, టీడీపీ తరఫున ఉమామహేశ్వరరావు బరిలో ఉన్నారు. ఇప్పటికే నామినేషన్ వేసిన ఉన్నం ఇండిపెండెంట్‌గా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ టీడీపీ కూడా రఘువీరాకు సహకరించేందుకు సిద్ధమైంది. రఘువీరా, ఉమా, ఉన్నంలు టీడీపీ ఓట్లును చీల్చనున్నారు. ఇదే జరిగితే అక్కడ ఎలాంటి ఫలితం ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు.గుంతకల్లు టిక్కెట్ ఆశించి భంగపడిన మధుసూదన్ గుప్తా జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. జనసేన తరఫున పోటీలో ఉన్నా...ఇతన్ని కూడా టీడీపీ రెబల్‌గానే భావించాలి. ఏడాదిగా అతను టీడీపీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో పనిచేశారు. జితేంద్రగౌడ్‌కు కాకుండా గుప్తాకే టిక్కెట్ అని ఆపార్టీ శ్రేణులు భావించాయి. ఎంపీ జేసీ కూడా గుప్తానే అభ్యర్థి అని ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో గౌడ్ బలహీనంగా తయారయ్యారు. ఇప్పుడు గుప్తాకు కాకుండా తిరిగి గౌడ్‌కే టిక్కెట్ ఇచ్చారు. దీంతో గుప్తా పార్టీ వీడి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. టీడీపీలోని బలమైన వర్గం గుప్తాతో నడవనుంది. దీంతో టీడీపీ ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వెంకట్రామిరెడ్డికి టీడీపీలోని ఓట్ల చీలిక కలిసిరానుంది. కదిరి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా ఇండిపెండెంట్‌గా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ నిమ్మల కిష్టప్ప, కందికుంట ప్రసాద్ చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదని అత్తార్‌తో అనుచరులు చెబుతున్నారు. కందికుంటకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని, ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి కందికుంటను ఓడించాలనే భావనలో అత్తార్ ఉన్నట్లు తెలుస్తోంది. మైనార్టీ నేతగా ఉన్న అత్తార్ వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి టీడీపీ కండువా కప్పుకుని మైనార్టీ ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేశారు. దీంతో అత్తార్ వెంట మైనార్టీలు వచ్చే అవకాశం లేదు. ఈ విషయం అత్తార్‌కు తెలుసు. అయితే టీడీపీలో ఉన్న మైనార్టీయేతర వర్గాల ఓట్లనైనా తాను చీల్చగలనని, తద్వారా సిట్టింగ్ అయిన తనను కాదని టిక్కెట్ తెచ్చుకున్న కందికుంటను ఓడించొచ్చనే ఎత్తుగడలో అత్తార్ ఉన్నారు.