హ్యాట్రిక్ అపజయాలను చూసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తనకు ఇంకా ఎమ్మెల్సీ పదవికి సయమమున్నా దానికి రాజీనామా చేసి మరీ బరిలోకి దిగారు. ఇరవై ఏళ్ల తర్వాత సోమిరెడ్డి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా కాకాణి గోవర్థన్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. సోమిరెడ్డికి విజయం దక్కి ఇరవై ఏళ్లవుతుంది. సర్వేపల్లినే మళ్లీ సోమిరెడ్డి నమ్ముకుని గెలుపు కోసం శ్రమిస్తున్నారు.సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచారు. ఆ తర్వాత ఆయనకు సర్వేపల్లి అచ్చిరాలేదు. వరసగా ఓటములనే చవిచూస్తున్నారు. 2014లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్ రెడ్డి 5,446 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ఎమ్మెల్సీ అయి మంత్రి పదవిని దక్కించుకున్నారు. అప్పటి నుంచి మంత్రిగా ఉన్నప్పటీకి సర్వేపల్లి నియోజకవర్గాన్ని మాత్రం సోమిరెడ్డి వదిలిపెట్టలేదు.నిన్న మొన్నటి వరకూ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలో ఉండేవారు. ఆయనకు కూడా సర్వేపల్లి నియజకవర్గంపై పట్టుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 2004,2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఆయన ఉండటంతో కొంత సోమిరెడ్డి విజయంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరి క్షణంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఆదాల ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు సోమిరెడ్డి మిస్సయ్యారు. అంతేకాదు టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతలంతా ఇప్పుడు వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. సోమిరెడ్డి సమీప బంధువులే వైసీపీ లోకి వెళ్లిపోవడంతో ఆయన కొంత ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సర్వేపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో వెనకబడి ఉన్నప్పటికీ పార్టీయే తనను గెలిపిస్తుందన్న ధీమాలో ఉన్నారు. సోమిరెడ్డి, కాకాణి బద్ధ శత్రువులు. ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. దీంతో పాటు సర్వే పల్లిలో బంధుగణం, అనుచరగణం ఉన్న ఆనం రామనారాయణరెడ్డి కూడా ఇప్పుడు వైసీపీలో ఉండటంతో ఆదాల, ఆనంల సహకారంతో తాను నెట్టుకురాగలనన్న ధీమాలో కాకాణి ఉన్నారు. మొత్తం మీద సర్వే పల్లి నియోజకవర్గంలో గెలుపు ఎవరికీ అంత ఈజీ కాదన్నది స్పష్టంగా తెలుస్తోంది.