ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? మరోసారి టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందా? వైసీపీ ఇక్కడ పుంజుకుందా? జనసేన ప్రభావం ఎంతవరకూ ఉంటుందన్న దానిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఫేట్ మార్చేసిన జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రధమమని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ సింగిల్ సీటు కూడా వైసీపీకి దక్కలేదు. జీరో రిజల్ట్ వచ్చింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 15 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మరొక స్థానంలో మిత్రపక్షమైన బీజేపీ విజయం సాధించింది. ఎన్నికలకు, ప్రస్తుతమున్న పరిస్థితికి ఎంతో తేడా ఉంది. గత ఎన్నికలలో జనసేన, బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేశాయి. ఇప్పుడు బీజేపీ ఒంటరిగా ఉంది. తెలుగుదేశం పార్టీ సయితం సింగిల్ గానే పోటీ చేస్తుంది. జనసేన సయితం తాను ఒక్కడినే బరిలోకి దిగుతానని ప్రకటంచింది. వైసీపీ ఎలాగూ ఒంటరిగానే పోటీకి దిగుతుంది. అయితే ఇప్పుడు 15 నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితిని చూస్తే తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో లాగా విజయం సులువుకాదన్నది స్పష్టంగా చెప్పొచ్చు. పధ్నాలుగు నియోజకవర్గాల్లో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడంతో వారిపై ఉన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు. ఇసుక దందాతో అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అప్రదిష్టను మూట కట్టుకున్నారు.దాదాపు పదిహేను నియోజకవర్గాల్లో విభేదాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బహిరంగంగా ప్రదర్శనలు చేయడం, మీడియా మీట్లు పెట్టి సిట్టింగ్ కు టిక్కెట్ ఇవ్వొద్దని గట్టిగా చెబుతున్నారు. ప్రస్తుత మంత్రి జవహర్, మాజీ మంత్రి పీతల సుజాత, బడేటి బుజ్జి వంటి వారున్నారు. ఏలూరు నియోజకవర్గంలో బడేటి బుజ్జి ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బుజ్జి వైఖరిని నిరసిస్తూ టీడీపీలో బలమైన నేత రెడ్డి అప్పలనాయుడు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇది ఏలూరు నియోజకవర్గంలో ప్రభావం చూపే అవకాశముంది. దెందులూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి అని పేరుంది. ఇక్కడ కూడా ఆయన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. విమానాల విడిభాగాల పరిశ్రమను ఏర్పాటు చేస్తమని చెప్పి వట్లూరులో రైతుల నుంచి భూములను సేకరించి ఒక్కరూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఇప్పించకపోవడంతో రైతులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు.ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా గన్ని వీరాంజనేయులుకు సెగ తగులుతోంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్న కొంత సానుకూలత ఉన్నప్పటికీ, ఆయన తమ్ముడు గన్ని గోపాలం షాడో ఎమ్మెల్యేగా ఉన్నారని, జన్మభూమి కమిటీలను నియంత్రించడంలో విఫలమయ్యారన్నది ప్రధాన ఆరోపణ. ప్రజల నుంచి కమీషన్లు ఇబ్బడి ముబ్బడిగా జన్మభూమి కమిటీలు వసూలు చేయడం మైనస్ పాయింట్. ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. కానీ ఈసారి జనసేన ఉండటంతో కాపులు టీడీపీకి అండగా నిలవకపోతే ఈయన గెలుపు కష్టమేనంటున్నారు. ఇక ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే కలిదిండి శివరామరాజు నియంతలా వ్యవహరిస్తారన్న పేరుంది. భీమవరం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామాంజనేయులుపై అసంతృప్తి ఉంది. ఈయన గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు. ఇక్కడ తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్ బాధితుల సెగ తగులుతుంది. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉండటం, సింగిల్ గా పోటీ చేస్తుండటంతో టీడీపీకి గత ఎన్నికల మాదిరిగా క్లీన్ స్వీప్ చేసే అవకాశం లేదంటున్నారు. జగన్ పాదయాత్రతో వైసీపీ బలం కూడా పెరగడం, జనసేన పోటీ చేస్తుండటంతో టీడీపీ బలహీనపడిందన్నది విశ్లేషకుల అంచనా.