యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మహేష్ మైనపు విగ్రహం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. దక్షిణాది హీరోల్లో ప్రభాస్ తర్వాత ఆ ఘనత సాధించింది మన సూపర్‌స్టారే. అయితే ఎక్కడో సింగపూర్ మ్యూజియంలో మహేష్ విగ్రహం పెడితే.. ఇక్కడ నుండి వెళ్లి ఆ విగ్రహాన్ని చూడటం అంటే అందరికీ కుదిరే పనికాదు. అయితే మహేష్ ఫ్యాన్స్ నిరుత్సాహపడకుండా ఉండేందుకు ఈ విగ్రహాన్ని మార్చి 25న హైదరాబాద్ తీసుకురానున్నారు. హైదరాబాద్ గచ్చీబౌలిలోని ఏఎంబి సినిమాస్ వేదికగా సూపర్ స్టార్ మహేష్ తన మైనపు విగ్రహాన్ని లాంచ్ చేయనున్నాడు. అనంతరం ఈ విగ్రహాన్ని ఒకరోజు పాటు ప్రదర్శనకు ఉంచనున్నారు. తరువాత సింగపూర్ తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు. మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబుకి అరుదైన గౌరవం దక్కడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తరువాత ‘ఎఫ్ 2’దర్శకుడు అనీల్ రావిపూడి కాంబోలో మరో చిత్రం చేయబోతున్నారు.