యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:
దక్షిణాదిలో అత్యంత ప్రాచుర్యం పొందిన హీరోయిన్లలో సమంత అక్కినేని ఒకరు. తన అద్భుతమైన నటన, క్యూట్ లుక్‌తో గత కొన్నేళ్లుగా దక్షిణాది ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ సమంతకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 6.2 మిలియన్లకు పైనే ఉన్నారు. ట్విట్టర్‌లో 7.3 మిలియన్లు దాటారు. అందుకే సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టినా లేదా ట్వీట్ చేసినా లక్షల కొద్దీ లైకులు, వేల కొద్దీ కామెంట్లు. ఈ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకోవడానికి చాలా కంపెనీలు సమంతతో ప్రకటనల కోసం ఒప్పందం చేసుకుంటున్నాయి. సమంత ఇప్పటికే చాలా బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. అయితే కొన్ని ఇతర బ్రాండ్లకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నందుకు కూడా సమంత పారితోషికం గట్టిగానే తీసుకుంటున్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల ద్వారా ఓ బ్రాండ్‌కు ప్రచారం కల్పిస్తున్నందుకు దక్షిణాది సినీ హీరోయిన్లు రూ.3 నుంచి రూ.4 లక్షలు తీసుకుంటున్నారట. కానీ, సమంత మాత్రం వాళ్లందరి కన్నా చాలా ఎక్కువ తీసుకుంటున్నారని సమాచారం. ఒక బ్రాండ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే రూ. 15 లక్షల వరకు వసూలు చేస్తున్నారట.
కొన్ని దుస్తులు, యాక్ససరీస్ బ్రాండ్లకు సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం కల్పిస్తున్నారు. కాబట్టి సినిమాలు, టీవీ యాడ్స్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ప్రకటనల ద్వారా కూడా సమంత భారీగానే సంపాదిస్తున్నారు. కంపెనీలు కూడా సమంతకు ఇంత మొత్తంలో పారితోషికం ఊరికే ఇవ్వడంలేదు. సమంత ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఒక్క పోస్టు పెడితే సుమారు 2 కోట్ల మందికి అది రీచ్ అవుతుంది. అంటే, అంత మంది ఈ బ్రాండ్ గురించి తెలుసుకుంటారు. అందుకే ఆయా కంపెనీలు ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనకాడటం లేదని టాక్.