యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నరసారావుపేట లోక్‌సభ పోరు ఈసారి చాలా రంజుగా మారింది. ఐదుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికైన రాజకీయ భీష్ముడు రాయపాటి సాంబశివరావు ఏడోసారి పోరుకు సిద్ధం కావడం విశేషం. ఇక ఆయనకు ప్రధాన ప్రతిపక్షం నుంచి యువనాయకుడు విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ లావు శ్రీకృష్ణదేవరాయలు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పల్నాటి పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఈ నియోజకవర్గంలో ప్రచారవ్యూహంపై రెండు పార్టీలు దృష్టి సారించాయి. ఈ నెల 21వ తేదీ ఉదయం వైసీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు నామినేషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ ఎంపీ, టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు 22వ తేదీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల కార్యక్రమం రోజునే తమ బలమేంటో రెండు పార్టీల నేతలు, అభ్యర్థులు చూపారు.పార్లమెంట్ సెగ్మెంట్ పరధిలో టీడీపీకి ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలుండటం ఆ పార్టీకి పెద్ద అండగా చెప్పుకోవచ్చు. ఈ ఐదుగురు గత రెండు ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ అక్కడ పాతుకుపోయి బలంగా ఉన్నారు. ఇక వైసీపీ నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎన్నికలకు రెడీ అయ్యారు. టీడీపీ నుంచి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరోసారి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. గురజాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, వినుకొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, చిలకలూరిపేట నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తిరిగి బరిలో నిలుస్తున్నారు. వైసీపీ నుంచి మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్లీ పోటీకి దిగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల పోరును ఇరు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో కుల సమీకరణాలే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో నేతలు అటువైపే ప్రధానంగా దృష్టి సారించారు. వివిధ కుల సంఘాల నేతలతో ఇప్పటికే భేటీ అవుతూ వస్తున్నారు. ఎంపీ సీటు కోసం పోటీ పడుతోన్న ఇద్దరు కమ్మ సామాజికవర్గానికే చెందిన వారు కావడం విశేషం. దీంతో నియోజకవర్గంలో మిగిలిన కులాల ఓట్లు ఎలా చీలతాయన్నది మాత్రం ఆసక్తిగా ఉంది. జిల్లాలో సుదీర్ఘకాలంగా పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్న రాయపాటికి ఎన్నికలకు తన వైపునకు తిప్పుకోవడం కొట్టిన పిండని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దానికి తోడు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్రభావంతో ఓటు బ్యాంకు కూడా బలంగా ఉందని వారు చెప్పుకోస్తున్నారు. అదే సమయంలో టీడీపీకి వ్యతిరేక ఓటు బలంగా ఉందని ఈసారి విజయం తమదేనని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.యువకుడు, విద్యావంతుడు అయిన శ్రీకృష్ణదేవరాయలు తన విజయం నల్లేరు మీద నడకే అంటూ చెబుతూ పోలిటికల్ హీట్ పెంచుతున్నారు. గత మూడేళ్లుగా వైసీపీకి గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులును జగన్ చివర్లో నరసారావుపేటకు మార్చారు. ఇక్కడ గెలుపు కోసం ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక తన వారసుడి సీటు కోసం చివరి వరకు పట్టుబట్టి చివరకు తాను ఎంపీగా రంగంలో ఉన్నారు. చంద్రబాబును నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనని, తాను గెలవడంతో పాటు సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను గెలిపించుకుంటానని రాయపాటి గట్టిగా చెబుతున్నారు. సీనియర్ వర్సెస్ జూనియర్ వార్‌లో చూడాలి ఏం జరుగుతుందో..??