Highlights
- మేన బావ వేధింపులే
- లేఖ రాసిన యువతి
మరో వ్యక్తితో వివాహం నిశ్చయమై ఆదివారమే నిశ్చితార్థానానికి ముహూర్తంగా నిర్ణయించిన నేపథ్యంలో ఆమె బలవన్మరణానికి పాల్పడడం వరంగల్ నగరంలో విషాదాన్ని నింపింది. తనును తప్పా మరొకరిని వివాహం చేసుకోవద్దని చెప్పడంతో పాటు ఇదే విషయమై వేధింపులకు పాల్పడుతున్న మేనబావ తీరుతో విసిగిపోయిన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ నగరంలోని గిర్మాజీపేట బొడ్రాయి ప్రాంతానికి చెందిన దొడ్డ మాధవి, సుధాకర్ దంపతులు స్థానికంగా కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. వీరికి మౌనిక, వెంకటేశ్ పిల్లలు ఉన్నారు. కూతురు మౌనిక ఎంబీఏ పూర్తిచేసిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా కొడుకు హైదరాబాద్‌లోనే ఎంటెక్ చదువుతున్నాడు.
మౌనికకు ఇటీవల సింగపూర్‌కు చెందిన యువకుడితో వివాహం కుదిరింది. నిశ్చితార్ధం పెట్టుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్న మేనబావ సంతోష్ తననే పెళ్లి చేసుకోవాలని, మరొకరిని చేసుకోవద్దని మౌనికను వేధించడం ప్రారంభించాడు. ఆమెతో కలిసి గతంలో దిగిన చిత్రాలను మార్ఫింగ్ చేసి ఆ ఫొటోలను సింగపూర్‌లో ఉంటున్న కాబోయే వరుడికి పంపించి వివాహం కాకుండా అడ్డుపడుతన్నాడు. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులు వరంగల్‌లోని ఇంతేజార్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈనెల 6వ తేదీన సంతోష్‌పై కేసు నమోదుచేసి ఈనెల 12న రిమాండుపై జైలుకు పంపించారు. నిశ్చితార్థానికి సమయం దగ్గర పడడంతో ఆమె రెండు రోజుల క్రితం వరంగల్ వచ్చింది. మరోవైపు ఇటీవలే జైలు నుంచి విడుదలైన సంతోష్ తన నిశ్చితార్థానికి అడ్డంకులు సృష్టిస్తాడనే అనుమానంతో మౌనిక ముందుగానే రాసుకున్న లేఖను తన వద్ద ఉంచుకొని శనివారం తెల్లవారుజామున ఇంట్లోని కిటికీ ఇనుప చువ్వలకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంతేజార్‌గంజ్ సీఐ సుంకరి రవికుమార్ మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తన ఆత్మహత్యకు మేనబావ పట్టూరి సంతోష్, మేనమామ వీరేశం, మేనత్త సరోజనలే కారణమని మౌనిక వద్ద లభించిన లేఖ ఆధారంగా వారిపై ఎస్సై వెంకటకృష్ణ కేసు నమోదుచేశారు.