Highlights
- 27 న ఆదిలాబాద్ పర్యటన
- ప్రాజెక్టుల స్వయంగా పరిశీలించనున్న సీఎం
- పాలమూరు, భద్రాద్రి జిల్లాల్లోనూ
తెలంగాణలో వచ్చే ఖరీఫ్‌కు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళివ్వాలని ప్రభుత్వం భావిస్తుండగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా పర్యటించి ప్రాజెక్టు పనుల తీరును పరిశీలించనున్నారు. నిర్మాణ పనులపై అంచనాకొచ్చి.. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మూడు, నాలుగు జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించాలని భావిస్తున్నారు.
అభివృద్ది పనుల పర్యవేక్షణ, భారీ ప్రాజెక్టుల శంఖుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు తన పర్యటన సందర్భంగా సిఎం కెసిఆర్ చేసే అవకాశముంది. ముందుగా ఈ నెల 27న సిఎం కెసిఆర్ పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు ఇప్పటికే అధికారులకు సమాచారమందించినట్లు తెలిసింది. పర్యటనలో భాగంగా చనాకా-కొరాటా బ్యారేజీని సిఎం పరిశీలించనున్నారు. మహారాష్ట్రతో ఒప్పందం కారణంగా చనాకా-కొరాటా బ్యారేజీ పనులు అడ్డంకులు అధిగమించి జరుగుతుండగా, ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి.
వచ్చే ఖరీఫ్‌కు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళివ్వాలని ప్రభుత్వం భావిస్తుండగా, ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా పర్యటించి ప్రాజెక్టు పనుల తీరును పరిశీలించనున్నారు. నిర్మాణ పనులపై అంచనాకొచ్చి.. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సిఎం కెసిఆర్ పర్యటన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగ్గా, ఇపుడు చనాకా-కొరాటా బ్యారేజీని సందర్శిస్తే అనుమానం లేకుండా ఇదే ఏడాది అందుబాటులోకి వస్తుందని రైతులు ఆశపడుతున్నారు. దీనితో పాటు జిల్లాలో నిర్మాణంలో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టులు, వాటి పురోగతిపై సిఎం ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తుమ్మిడిహట్టి వద్ద నిర్మిస్తున్న ప్రాణహితకు సంబందించిన వివరాలు కూడా అధికారయంత్రాంగం నుండి ఆయన తీసుకునే అవకాశం ఉంది. సిఎం నేరుగా బ్యారేజీని సందర్శించడం కాకుండా.. ఆదిలాబాద్ ప్రాజెక్టులు, సమస్యలపై సమగ్రంగా అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కరోజు కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులు సిఎం పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సింగరేణిలో సందడి
ముఖ్యమంత్రి కెసిఆర్ పూర్వ ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్‌నూ సందర్శించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సింగరేణి అధికారయంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సిఎం పర్యటన సందర్భంగా ఆరు నూతన గనుల ప్రారంభానికి ఒకే చోట శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారు. మణుగూరు కొండాపురం ఖని, కొత్తగూడెంఏరియాలోని రాంపురం షాఫ్ట్, మందమర్రి ఏరియాలోని కెకె-6, కాసిపేట-2, భూపాలపల్లి ఏరియాలోని కెటికె-5, కెటికె-3 గనులను సిఎం ప్రారంభించనుండగా, ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సిఎం మాట్లాడనున్నారు. కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాలపై తన పర్యటన సందర్భంగా సిఎం స్పష్టతనిస్తారని కార్మిక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. సిఎం పర్యటన సమా చారం కోల్‌బెల్ట్‌లో కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఇక బొగ్గుగనుల ప్రైవేటీకరణ వ్యవహారంపైనా సిఎం ఈ సందర్భంగా స్పందించే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
పాలమూరు, భద్రాద్రి జిల్లాల్లో కూడా..
పాలమూరు, భద్రాద్రి జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించే అవకాశం ఉంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి పలు ప్యాకేజీల పనులు పురోగతిలో ఉండగా.. సిఎం కెసిఆర్ వీటిని పరిశీలించే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు శనివారం పాలమూరు జిల్లాల్లో పర్యటించి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించడంతో పాటు పనుల పూర్తికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి తన పర్యటన సందర్భంగా ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను కాకుండా.. పాలమూరు- రంగారెడ్డికి సంబంధించిన ప్యాకేజీలను మాత్రమే పరిశీలించి, జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులు.. పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉంది. మార్చి మొదటివారంలో సిఎం పాలమూరు జిల్లాలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మంత్రి హరీష్ కూడా సిఎం పాలమూరు జిల్లాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. ఇక భద్రాద్రి జిల్లాలోనూ సిఎం పర్యటించే అవకాశముంది. మార్చిలోనే సిఎం భద్రాద్రిని సందర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే భద్రాద్రి ఆలయ నమూనాలు ఫైనల్ చేసిన నేపథ్యంలో.. సీతారామ చంద్రస్వామి ఆలయ నవీకరణ పనులకు సిఎం శంఖుస్థాపన చేసే అవకాశముంది. నమూనాలపై.. మరింత పరిశీలన అవసరమని భావిస్తే నిపుణులతో కలిసి ఆలయాన్ని పరిశీలించ వచ్చన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా పర్యటనపై అదికార యంత్రాంగంతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఒక్కరోజు పర్యటన ఉంటే.. సిఎం ఆలయ పర్యటనకు పరిమితమయ్యే అవకాశముందని, రెండు రోజుల షెడ్యూల్ ఉంటే వేగంగా పనులు జరుగుతున్న 800మెగావాట్ల కొత్తగూడెం ఏడోదశ ధర్మల్‌ప్లాంట్, మణుగూరు భద్రాద్రి ధర్మల్ కేంద్రాల పనులనూ సిఎం పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. ఈ రెండు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకుని, శంఖుస్థాపన చేశారు. షెడ్యూల్‌పై స్పష్టత రావాల్సి ఉన్నా.. ఆయా జిల్లాలకు సిఎం వస్తున్నారని, ఇప్పటికే అధికారయంత్రాగానికి మాత్రం సంకేతాలు అందినట్లు తెలిసింది.