Highlights
ఈ ఏడాది ఏడుగురు న్యాయమూర్తులు రిటైర్మెంట్
మార్చి 1న జస్టిస్ అమితవ రాయ్ పదవీవిరమణ
మే 4న జస్టిస్ రాజేష్ అగర్వాల్ రిటైర్
పెండింగ్ లో కేసులు
న్యాయమూర్తుల కొరతతో పలు కేసులు పెండింగ్‌లో ఉంటున్న క్రమంలో ఈ ఏడాది ఏకంగా ఏడుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు రిటైర్ కానుండటంతో సమస్య మరింత జటిలం కానుంది. సర్వోన్నత న్యాయస్ధానం ఇప్పటికే ఆరుగురు న్యాయమూర్తుల కొరతతో సతమతమవుతోంది. ఇద్దరు న్యాయమూర్తుల నియామకం సత్వరమే చేపట్టాలన్న సూచన ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉంది. మార్చి 1న జస్టిస్ అమితవ రాయ్ పదవీవిరమణ చేయనుండగా, మే 4న జస్టిస్ రాజేష్ అగర్వాల్ రిటైర్ కానున్నారు.
ఇక చీఫ్ జస్టిస్ తర్వాత సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జే . చలమేశ్వర్ జూన్ 22న, జస్టిస్ ఆదర్శ్ గోయల్ జులై 6న పదవీవిరమణ చేయనున్నారని సుప్రీం కోర్టు, న్యాయమంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. ఇక సీజేఐ దీపక్ మిశ్రా అక్టోబర్ 2న, జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29న, జస్టిస్ మదన్ బీ లోకూర్ డిసెంబర్ 30న పదవీవిరమణ చేయనున్నారు న్యాయమూర్తులు పెద్దసంఖ్యలో రిటైర్ కానుండటం, ఇప్పటికే ఆరుగురు న్యాయమూర్తుల కొరత నెలకొనడంతో కొలీజియం జడ్జీల ఎంపికపై ఒత్తిడి ఎదుర్కోనుంది. న్యాయమూర్తుల నియామకంపై ప్రభుత్వం సత్వరమే స్పందించి పెండింగ్ కేసులు పేరుకుపోకుండా చూడాల్సిఉంది.