YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గరం..గరంగా కర్నూలు రాజకీయాలు

గరం..గరంగా కర్నూలు రాజకీయాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కర్నూలులో రాజకీయాలు భలే పసందుగా ఉన్నాయి. దగ్గర బంధువులు కూడా తలో పార్టీలో ఉంటూ బరిలోకి దిగుతున్నారు. సహజంగా అన్ని నియోజకవర్గాల్లో వీరికి బంధుగణం ఉంటుది. కానీ అభ్యర్థులు తలో పార్టీలో ఉండటంతో వీరంతా తమ నియోజకవర్గాల్లో ఎవరికి ఓటెయ్యాలని తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. రాష్ట్రమంతటా ఒక ఎత్తు. కర్నూలు జిల్లాది ఒక ఎత్తు. ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలతో పాటు ముఠాలకు కూడా పెట్టింది పేరు. శత్రువు పార్టీలోకి వస్తుంటే తాము పార్టీ మారేందుకు వెనుకాడరు. అలాంటిది దశాబ్దాలుగా శత్రుత్వం ఉన్న కేఈ కృష్ణమూర్తి, కోట్ల కుటుంబాలు ఇప్పుడు ఒక్కటయ్యాయి. రెండు కుటుంబాలు కలసి ఒకే పార్టీలో పోటీ చేస్తున్నాయి.ఇక నంద్యాల టీడీపీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి. ఈయనకు పిల్లనిచ్చిన మామ కాటసాని రామిరెడ్డి. భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీలో ఉండగా కాటసాని రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అల్లుడు బ్రహ్మానందరెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉండగా, బనగానపల్లె నుంచి మామ కాటసాని రామిరెడ్డి బరిలో ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో రెండు కుటుంబాల మధ్య బంధువులు వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు నంద్యాలలో వీరు టీడీపీకి ఓటేస్తే.. బనగానపల్లె లో మాత్రం ఇదే కుటుంబానికి చెందిన వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సి వస్తోంది.బనగానపల్లి నుంచి టీడీపీ అభ్యర్ధి బీసీ జనార్థన్ రెడ్డి నంద్యాల టిక్కెట్ ను భూమాకు ఇవ్వవద్దని పట్టుబట్టింది కూడా కాటసాని వల్లనేనంటారు. తన ప్రత్యర్థి అల్లుడికి టిక్కెట్ ఎలా ఇస్తారని బీసీ జనార్థన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారట. బ్రహ్మానందరెడ్డికి నంద్యాల టిక్కెట్ ఇస్తే తాను ఇక్కడ పోటీ చేయనని కూడా చెప్పారన్నది టాక్. ఇక భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పుడు ఆమె మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి చేరువయ్యారు.ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలోని ఎంపీ, 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని, చంద్రబాబు తనకు చేసిన మోసాన్ని ఎండగడతానని ఎస్వీ శపథం చేశారు కూడా. మరి ఆళ్లగడ్డ, నంద్యాలలో ఎస్వీ మోహన్ రెడ్డి ఎవరి తరుపున ప్రచారం చేస్తారన్నది ప్రశ్నే. కానీ ఎస్వీ కేవలం కర్నూలుకే పరిమితమవుతారని తెలుస్తోంది. అక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపించుకుని మరీ వస్తానని వైసీపీ నేతలకు ఫోన్ చేసి చెప్పడం చూస్తుంటే ఆయన కర్నూలుపైనే దృష్టి పెడతారు. ఇలా ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఇతర పార్టీల్లో ఉండటంతో ముఖ్యంగా బంధువులు కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. కర్నూలు జిల్లాలో పార్టీల కంటే కుటుంబాలకే ప్రాధాన్యత ఎక్కువన్నది ఈ సంఘటనలతో స్పష్టం అవుతుంది.

Related Posts