YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉత్తర భారతీయులను నమ్ముకున్న కమలం

ఉత్తర భారతీయులను నమ్ముకున్న కమలం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విశాఖ పార్లమెంట్ కు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ ఎంపిక చేసింది. ఇక్కడ నుంచి 2009 ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి గెలిచిన పురంధేశ్వరి ఆ తరువాత కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపీ విశాఖ జిల్లాలో అన్ని విధాలుగా దెబ్బతింది. 2014 నాటి కంటే కూడా బలాన్ని బాగా కోల్పోయింది. అయితే విశాఖకు రైల్వే జోన్ ప్రకటించడం, కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తారని అంచనాలు ఉండడం, పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ వంటివి విశాఖ పార్లమెంట్ పరిధిలో మరీ ముఖ్యంగా విశాఖ నగరంలో బీజేపీకి బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీకి నగరంలో ఎంతో కొంత బలం ఉంది. మధ్యతరగతి వర్గం మళ్ళీ మోడీ వైపు చూస్తున్నారు. ఇక విశాఖ నగరంలో ఎక్కువగా ఉత్తరాది ప్రాంతీయుల జనాభా ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్ ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఎక్కువ.అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా విశాఖలోనే ఉన్నాయి. దాంతో దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన వారంతా విశాఖలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇపుడున్న పరిస్థితుల్లో దేశంలో మోడీ తప్ప వేరే ప్రత్యామ్న్యాయం బలపడకపోవడం వల్ల బీజేపీకి ఓట్లు వేసేందుకు ఆస్కారం కల్పిస్తోంది. ఇక విశాఖలో బీజేపీకి ఉత్తరం నుంచి మళ్ళీ పోటీ చేస్తున్న విష్ణు కుమార్ రాజు వంటి గట్టి అభ్యర్ధి ఉన్నారు. ఆయనకు మంచి పేరు అక్కడ ఉంది. అది తప్పితే పెద్ద నాయకులు ఎవరూ అసెంబ్లీ బరిలో లేరు. అయితే అన్ని పార్టీలు ఇప్పటికే ఎంపీ సీట్లు ప్రకటించాయి.అలా చూసుకున్నపుడు విశాఖ ఎంపీ అభ్యర్ధుల నుంచి ఎంచుకోవడానికి బీజేపీ తరఫున పురంధేశ్వరి మంచి ఛాయిస్ అవుతారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. టీడీపీ నుంచి మూర్తి మనవడు శ్రీ భరత్ పోటీ చేస్తున్నారు. ఆయన రాజకీయాలకు కొత్త. అలాగే వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయాణ కూడా ప్రజలకు పరిచయం ఉన్న వారు కాదు. ఇక జనసేన అభ్యర్ధి లక్ష్మీ నారాయాణ విద్యాధికులకు తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు. పైగా ఆయన దిగుమతి సరకు అంటూ ప్రచారం మొదలైపోయింది. ఇక కాంగ్రెస్ నుంచి పేడాడ రమణికుమారి పోటీ చేస్తున్నారు. ఆమె కూడా జనాలకు పరిచయం ఉన్న వారు కాదు. ఈ విధంగా చూసుంటే ఇపుడున్న పరిస్థితుల్ల్లో పురంధేశ్వరి మంచి అభ్యర్ధి అవుతారని అంటున్నారు.మరో మారు కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తారని, విశాఖ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న చోట కేంద్రం అవసరం చాలా ఎక్కువగా ఉంటుందని భావించిన వారంతా బీజేపీకి ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సామాజిక వర్గ సమీకరణలు తీసుకుంటే టీడీపీ, వైసీపీ, బీజేపీ ముగ్గురు అభ్యర్ధులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. విశాఖ జనాభాలో వీరి సంఖ్య కూడా ఎక్కువే. దాంతో ఎంచుకోవాల్సివస్తే మొదటి ఓటు ఆ సామాజికవర్గం కూడా బీజేపీకే వేస్తుందని అంటున్నారు. సిట్టింగ్ ఎంపీ హరిబాబు తాను పోటీ చేయనని చెప్పడంతో ఆయన పలుకుబడి కూడా పురందేశ్వరికి మళ్ళించినట్లైతే బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.

Related Posts