YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంగళగిరి బరిలో జనసేన

మంగళగిరి బరిలో జనసేన

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి జనసేన కేటాయించింది. కీలకమైన ఈ స్థానంలో టీడీపీ నుంచి మంత్రి నారా లోకేశ్‌ పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో నిలిచారు. అయితే, ఈ స్థానంలో జనసేన అనూహ్యంగా తన అభ్యర్థిని ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు పవన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించగా ఆ పార్టీ నుంచి ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, పవన్ కూడా తన అభ్యర్థిగా చల్లపల్లి శ్రీనివాస్‌‌ పేరు ప్రకటించడంతో ఆయన సోమవారం నామినేషన్‌ వేశారు. జనసేన, వామపక్షాలు, బీఎస్పీలు కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తుల్లో భాగంగా 14 అసెంబ్లీతో పాటు, నాలుగు పార్లమెంట్‌ స్థానాలను వామపక్షాలకు కేటాయించారు. ఇక విజయవాడ పార్లమెంటు సీటు విషయంలోనూ పవన్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఆ స్థానం సీపీఐకి కేటాయించినా చివరి నిమిషంలో ముత్తంశెట్టి సుధాకర్‌ను ప్రకటించి సంచలనానికి తెరతీశారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై సీపీఐ నేతలు అసంతృప్తికి గురయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు జనసేనతో చర్చలు జరిపి సర్దుబాటు చేసుకున్నారు. 
సీపీఐ తరఫున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా, చల్లపల్లి శ్రీనివాస్‌ను పేరును ప్రకటించిన పవన్, ఆదివారం అర్ధరాత్రి బీ ఫారాన్ని అందజేశారు. స్థానికంగా ఉన్న జనసేన నేతలను సంతృప్తి పరిచేందుకు, స్థానికంగా ఉన్న పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి సీటును సీపీఐకి కేటాయించడంపై కూడా వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడంతో వాటికి చెక్ పెట్టేందుకు పవన్ యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీకి బీ టీమ్‌గా జనసేనను వైసీపీ అభివర్ణిస్తూ ఆరోపణలు చేయడంతో పవన్ పునరాలోచించి వారి నోళ్లు మూయించేందుకు ఇలా చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 

Related Posts