యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నగరి ఎమ్మెల్యే రోజా వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రోజా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు తెలిసాయి. తనకు అప్పులు ఉన్నాయని.. భర్త పేరు మీద స్థిరాస్తి లేదని.. ఇద్దరు పిల్లల పేరిట బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తికరంగా తనకు ఏడు కార్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రస్తావించారు రోజా. ఆ కార్ల వివరాలను పొందుపరిచారు. అలాగే తన పేరుమీద అప్పులు కూడా ఉన్నట్లు ప్రస్తావించారు. రోజా తన పేరు మీద మొత్తం రూ.7,38,38,430 ఆస్తి ఉందన్నారు. అందులో స్థిరాస్తి రూ.4,64,20,669.. చరాస్తి రూ. 2,74,17,761.. అప్పులు రూ.49,85,026. భర్త సెల్వమణి పేరుతో ఎలాంటి స్థిరాస్తి లేదని.. చరాస్తి రూ.58,02,953.. అప్పులు రూ.22,00,000 ఉన్నట్లు చూపించారు. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: 58,80,000.. ఇక కుమార్తె అనూష, కుమారుడు కృష్ణ కౌశిక్ పేరుతో ఉన్న రూ.50,56,191 డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. రోజా కార్ల విషయానికి వస్తే.. తనకు మహీంద్రా, ఫోర్డ్ ఇండీవర్, చావర్‌లెట్, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్, హూండా స్ల్పెండర్, మహీంద్రా స్కార్పియో ఉన్నాయన్నారు.ఈ కార్ల విలువ రూ.1,08,16,564 ఉంటుందని పొందుపరిచారు.