యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కనీస ఆదాయ పథకం వివరాలను ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ పథకం కింద ప్రతి ఏటా దేశంలోని 20 శాతం నిరుపేదలకు రూ.72 వేలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ డబ్బంతా నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తుందని రాహుల్ తెలిపారు. దేశంలోని 20 శాతం అంటే.. 5 కోట్ల కుటుంబాలకు (సుమారు 25 కోట్ల మంది) ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని ఆయన చెప్పారు. ఆర్థికంగా ఇది సాధ్యమే. గత నాలుగైదు నెలలుగా ఈ పథకంపై అధ్యయనం చేస్తున్నాం. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకానికి మేము కట్టుబడ్డాం. దానిని సమర్థంగా అమలు చేశాం. ఇప్పుడు పేదలకు న్యాయం చేస్తాం అని రాహుల్ అన్నారు. ఇది అత్యంత శక్తివంతమైన ఆలోచన అని ఆయన చెప్పారు. తొలి విడత పోలింగ్ నామినేషన్లకు చివరి రోజు రాహుల్ ఈ చారిత్రక పథకం వివరాలను వెల్లడించడం విశేషం. దీనికి ముందు కాంగ్రెస వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈ పథకం వివరాలు మీడియాకు వెల్లడించిన తర్వాత.. ఆశ్చర్యపోయారా అంటూ రాహుల్ ప్రశ్నించారు.నెలకు ఒక్కో కుటుంబం కనీసం రూ.12 వేల ఆదాయం పొందేలా ఈ పథకం రూపొందించినట్లు రాహుల్ తెలిపారు. అంటే ప్రతి కుటుంబానికి ఈ మొత్తం అందుతుందని కాదు. ఉదాహరణకు ఒక కుటుంబం నెలకు రూ.6 వేలు సంపాదిస్తుంది అనుకుంటే.. దానిని రూ.12 వేలకు పెంచుతామని రాహుల్ చెప్పారు. ఇదొక చారిత్రక పథకం అని ఆయన ప్రకటించారు. నిజానికి గత జనవరిలోనే రాహుల్ గాంధీ ఈ పథకం గురించి సూత్రప్రాయంగా వెల్లడించారు. అయితే ఇది సాధ్యమయ్యే పథకం కాదని నీతి ఆయోగ్ కొట్టి పారేసింది. దేశం అంత భారం మోసే స్థితిలో లేదని చెప్పింది. అంతేకాదు ఈ పథకం అమలు చేసేందుకు కావాల్సినంత డేటా కూడా లేదని స్పష్టం చేసింది. అయితే ఈ పథకం అమలు చేస్తామన్న విశ్వాసం తమకుందని రాహుల్ అంటున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయగా లేనిది.. ఇది చేయలేమా.. దేశం నుంచి పేదరికాన్ని పారదోలుతాం. ఇది పేదరికంపై జరిగే చివరి యుద్ధం అని రాహుల్ అన్నారు