యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడికి అభ్యంతరం ఏంటని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రత్యేకహోదాకు మద్దతు ఇస్తున్నారనీ, వైసీపీకి కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ జగన్ కు రూ.1,000 కోట్లు పంపాడని సీఎం చంద్రబాబు విమర్శలు చేయడంపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తనకు రూ.1,000 కోట్లు ఇచ్చారని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘అయ్యా చంద్రబాబూ.. కేసీఆర్ నాకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చినట్లు మీరు చూశారా? లేక కేసీఆర్ మీకు ఫోన్ చేసి చంద్రబాబూ.. చంద్రబాబూ.. నేను జగన్ కు వెయ్యి కోట్లు పంపించా అని చెప్పాడా?’ అని నిలదీశారు. చంద్రబాబు పార్టనర్, యాక్టర్ పవన్ కల్యాణ్ కూడా ఇదే భాషను మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ యాక్టర్ గత ఐదేళ్లలో కేసీఆర్ ను ఎన్నిసార్లు పొగిడారో గుర్తుచేసుకోవాలని సూచించారు. చంద్రబాబు యెల్లో మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇతర అమ్ముడుపోయిన మీడియా వైసీపీని లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. ‘వీరంతా రోజంతా ‘జగన్.. జగన్.. జగన్.. జగన్ అని అంటున్నారు. వీళ్ల బాధలు చూస్తుంటే నాకు నిజంగా నవ్వాలనిపించింది. పండ్లు ఉండే చెట్టుమీదనే రాళ్లు పడతాయి. గెలుస్తుందన్న పార్టీ మీదనే విమర్శలు వస్తున్నాయి. జనం మన వెంట ఉన్నారు కాబట్టే కుట్రలు పన్నుతున్నారు. జగన్.. జగన్.. జగన్ అని కలవరిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. సిగ్గులేకుండా, వయసుకు గౌరవం లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకే చెల్లుబాటు అవుతుందని విమర్శించారు. ప్రత్యేకహోదాకు వేరే రాష్ట్రాలు మద్దతు ఇస్తుంటే చంద్రబాబుకున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ‘హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని పొత్తు కోసం టీఆర్ఎస్ తో బేరాలు చేయడం సబబేనా చంద్రబాబు ? నీతో పొత్తు పెట్టుకుంటే వాళ్లు మంచివాళ్లు, మీరూ మంచివాళ్లు. పొత్తు పెట్టుకోకుంటే వాళ్లంతా అన్యాయస్తులు, దుర్మార్గులు అని ఎలా అంటావ్ చంద్రబాబూ?’ అని నిలదీశారు.తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని ఏపీ సీఎం చంద్రాబాబు నాయుడే చంపించాడని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. చంద్రబాబు చెప్పని అబద్ధం, చేయని మోసం ఉండదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆస్తులన్న ఏపీ వ్యాపారస్తులను, టీడీపీ మద్దతుదారులను తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారని చంద్రబాబు చెప్పడాన్ని వైసీపీ అధినేత తప్పుపట్టారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులను బెదిరించడం నిజమే అయితే కేసీఆర్ ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావును బెదిరించారా? అని జగన్ ప్రశ్నించారు. అలాగే ఆంధ్రజ్యోతి సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణకు కూడా బెదిరించారా? అని చంద్రబాబును నిలదీశారుఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ‘చంద్రబాబు నాయుడుగారికి హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయ్. మరి వాటిని కేసీఆర్ లాక్కున్నారా? అని అడుగుతున్నా. తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో మనవాళ్లకు చంద్రబాబు అనే పెద్దమనిషి అపకారం చేస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను చేసిన అభివృద్ధిని చూసి, పాలనను చూసి ఓటేయమని కోరతారు.కానీ ఇలా అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. ప్రజలను ఓట్లు అడగలేక జగన్ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది. ఏదో జరిగిపోతుంది అని ప్రజలను బెదిరిస్తున్నారు’ అని దుయ్యబట్టారు. తన చిన్నాన్నను చంపించిన చంద్రబాబు.. ఆ బురదను తమపై చల్లుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చ జరిగితే ఆయనకు డిపాజిట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. తన మీడియాలో గత 20 రోజులుగా ప్రజల దృష్టి మరల్చేలా కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు.