యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
:ప్రముఖ నటి జయప్రద బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజాంఖాన్ పై ఆమెను పోటీలోకి దించనున్నట్టు సమాచారం. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో కొనసాగిన జయప్రద... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బహిష్కరణకు గురయ్యారు. అనంతరం ఆమె అమర్ సింగ్‌తో చేతులు కలిపి రాష్ట్రీయ లోక్‌మంచ్ పేరుతో సొంతపార్టీ పెట్టారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేసినప్పటికీ... ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.కాగా జయప్రద తన గాడ్ ఫాదర్ గా చెప్పుకునే అమర్ సింగ్ కొన్నేళ్లుగా బీజేపీతో సన్నిహితంగా మెలగడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మై భీ చౌకీదార్ ప్రచారానికి మద్దతుగా ఇటీవల ట్విటర్లో ఆయన తన పేరుముందు చౌకీదార్ అని కూడా చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరిన జయప్రద... 1994లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విబేధాల కారణంగా ఆమె టీడీపీ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఉత్తరాది రాజకీయాల్లోకి వెళ్లారు. సమాజ్ వాద్ పార్టీలో చేరారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో ఆమె రామ్‌పూర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమెను 2010లో పార్టీ బహిష్కరించింది.