YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ స్టాండ్ మార్పు వెనుక...

 పవన్ స్టాండ్ మార్పు వెనుక...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అతి జాగ్రత్త అనర్థదాయకం. రాజకీయాల్లో కొంప ముంచేస్తుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే ఫర్వాలేదు. కానీ దీర్ఘకాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అతిగా ఆలోచిస్తే నిండామునిగిపోవడం ఖాయం. ప్రత్యర్థితో భవిష్యత్తులో అవసరముంటుందనే అంచనాతో విమర్శల జోరు తగ్గిస్తే పార్టీ బలహీనపడిపోతుంది. అందుకే ప్రత్యర్థిపార్టీలోకి జంప్ అయ్యే గంట ముందు కూడా గట్టిగానే విమర్శలు కురిపిస్తుంటారు నాయకులు. పవన్ రాజకీయాలు మాత్రం ఈ విషయంలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. విమర్శలలో ప్రత్యర్థులిద్దరినీ సమానంగా చూడకుండా హెచ్చుతగ్గుల వ్యత్యాసం చూపిస్తున్నారు. దీంతో అనేక అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. జనసేన పార్టీ పోటీ సీరియస్ నెస్ కోల్పోతోంది. తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలకు ఆస్కారం ఏర్పడుతోంది. నిజంగానే ఆ రకమైన ఒప్పందాలున్నాయా? అసలు పవన్ కల్యాణ్ టీడీపీ విషయంలో పదునెందుకు తగ్గించారనే అంశం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈ ముద్రను తొలగించుకోకపోతే టీడీపీ, జనసేన ఒకటేనన్న ప్రచారం ప్రజల్లో బాగా వ్యాపించి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేలపై గట్టిగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు పవన్. చంద్రబాబు నాయుడి వాటా వచ్చేసరికి వేగం , ధాటి , తీవ్రత తగ్గిపోతోంది. గతంలో మంగళగిరిలో లోకేశ్ పై విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు అతని పేరే ప్రస్తావించడం లేదు. ఇవన్నీ జనసైనికులకు అయోమయం కల్పిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు, తెలుగుదేశానికి మధ్య కనీస అవగాహన ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. ప్రముఖ రియల్ఎస్టేట్ నిర్వాహకుడు వీరి మధ్య అనుసంధానకర్తగా, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే పలు వాదనలు వినవచ్చాయి. ఆరునెలల క్రితం రాష్ట్రప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ క్రమేపీ తన దూకుడుని తగ్గించేశారు. గడచిన రెండు నెలల కాలంలో నామ్ కే వాస్తే విమర్శలే తప్ప సూటిగా టీడీపీని టార్గెట్ చేసే అస్త్రాలే కరవు అయ్యాయి. తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేనను గెలిపించాలని కోరుతున్నారు. వైసీపిని ఎన్నుకుంటే జరిగే నష్టం, జగన్ అవినీతి గురించి తీవ్రంగానే ధ్వజమెత్తుతున్నారు. అంతే తప్ప టీడీపీని తిరిగి ఎన్నుకుంటే జరిగే నష్టం , ఈ ప్రభుత్వ నిర్వాకం గురించి ప్రజలకు విడమరిచి చెప్పడం లేదు. దీంతో అంత సీరియస్ అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే వదిలేస్తున్నారేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి.కేసీఆర్, జగన్, మోడీ కలిసికట్టుగా ఉన్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పవన్ ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం కూడా అదే యత్నంలో ఉంది. సిమిలర్ అజెండా. టీడీపీ నాయకులు వైసీపీలో చేరేలా టీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరిస్తోందని చంద్రబాబు చాలాకాలంగా చెబుతున్నారు. చాలామంది నాయకులు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా సైకిల్ దిగి పోయారు. అయినప్పటికీ టీడీపీ విమర్శలను ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కానీ తన జనసేనలోకి వస్తానన్నవారు వైసీపీలోకి వెళ్లిపోయారు. దీనికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ పవన్ విమర్శించడంతోనే ఆసక్తిగా చర్చించడం మొదలైంది. కేసీఆర్ తో సన్నిహితంగా ఉండే పవన్ టీఆర్ఎస్, వైసీపీలను ఒకేగాటన కట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో విమర్శకు కొంత సాధికారత వస్తోంది. వైసీపీ వ్యూహాలకు జనసేన ఆరోపణలు కౌంటర్ స్ట్రాటజీగా ఉపకరిస్తున్నాయి. టీడీపీకి కొంత అండదండలు లభిస్తున్నాయి. తెలంగాణలోని తన ఆస్తులకు నష్టం వాటిల్లినా ఫర్వాలేదు. రాష్ట్రప్రయోజనాలే ముఖ్యమంటూ పవన్ చేస్తున్న విమర్శలు పదునుగా ప్రజల్లోకి వెళుతున్నాయి. ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుతున్న నేపథ్యంలో పవర్ స్టార్ తీసుకున్న స్టాండ్ బాగానే పనిచేస్తోంది. ఆ పార్టీకి పనికొచ్చినా లేకపోయినా టీడీపీకి ఎంతోకొంత అడ్వాంటేజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.పవన్ కల్యాణ్ ను ఆవేశపరునిగా చూస్తుంటారు. తోచింది మాట్టాడుతుంటారని భావిస్తారు. కానీ తెలుగుదేశంతో వ్యవహారం విషయంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ప్రవర్తిస్తున్నారని జనసేన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చేస్థాయి బలాన్ని సాధించలేమని ప్రయివేటు సంభాషణల్లో జనసేన నాయకులు అంగీకరిస్తున్నారు. కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు అవసరమైనన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు. అదే జరిగితే రెండు ప్రధాన పార్టీల్లో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరకంగా ఎంచుకోవాల్సి వస్తే వైసీపీ కంటే టీడీపీ వైపే పవన్ మొగ్గుచూపుతారనే భావన ఉంది. వైసీపీపై తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పవన్ పై జగన్ వ్యక్తిగతంగా కూడా గతంలో విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితుల్లో బెటర్ చాయిస్ తెలుగుదేశమే అవుతుంది. మరింత కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మళ్లీ తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడితే సమాధానం చెప్పలేకపోవచ్చు. ప్రస్తుతానికి ఎన్నికల్లో జగన్, చంద్రబాబు లను ఒకేగాటన కట్టి విమర్శించినప్పటికీ వీరిలో ఒకరికి చేయూతనివ్వాల్సిన అవసరం జనసేనకు ఏర్పడుతుందనే భావన ఆపార్టీలో ఉంది. పవన్ సన్నిహితుల్లో మెజార్టీ వర్గం టీడీపీ కారణంగా జనసేనకు నష్టం తక్కువనే అభిప్రాయంతో ఉన్నారు. వైసీపీ కనుక అధికారంలోకి వస్తే..జనసేన ను ముందుగా దెబ్బతీస్తుందనే ఆందోళన ఉంది. అందువల్లనే టీడీపీ, వైపీపీ పట్ల తన వైఖరిలోనే పవన్ వ్యత్యాసం చూపుతున్నారనేది రాజకీయ పరిశీలకుల అంచనా.

Related Posts