యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఐపీఎల్ 12వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. సోమవారం రాజస్థాన్‌ను దాని సొంతగడ్డపై 14 పరుగుల తేడాతో ఓడించింది. మొదట క్రిస్ గేల్ (79; 47 బంతుల్లో 8×4, 4×6), సర్ఫ్రాజ్ ఖాన్ (46 నాటౌట్; 29 బంతుల్లో 6×4, 1×6) మెరుపులతో కింగ్స్ ఎలెవన్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులే చేయగలిగింది. జోస్ బట్లర్ (69; 43 బంతుల్లో 10×4, 2×6) ఛేదనలో మంచి పునాది వేసినా.. రాయల్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ముజీబ్ రెహ్మాన్ (2/31), అంకిత్ రాజ్‌పుత్ (2/33) ఆ జట్టుకు కళ్లెం వేశారు. గేల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.