యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపిన చంద్రబాబుకు ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకతను ఎలాగైనా తొలగించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. గత ఐదేళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను తొలగించడమే చంద్రబాబు ముందున్న లక్ష్యం. 34 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మినహాయించి దాదాపు అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ తిరిగి టక్కెట్లు ఇచ్చేశారు. కార్యకర్తల మనోభావాలు, వివిధ సంస్థల ద్వారా చేయించిన సర్వేల ఆధారంగా టిక్కెట్ల పంపిణీ జరిగినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నా..లోలోపల మాత్రం ఓటమి అంచున ఉన్నామన్న విషయం అర్థమవుతోంది.ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల పై ఉన్న వ్యతిరేకత అంతాఇంతా కాదు. మరోవైపు జనసేన పవన్ కల్యాణ్ పార్టీ వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. అంతేకాకుండా చాలా మంది టీడీపీ నేతలు ఇప్పటికే పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఈ సంకేతాలన్ని గెలుపు అంత ఈజీ కాదన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఎన్నికల వేళ మరిన్ని వరాలను కురిపించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు ముందు పెంచిన పింఛన్లు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ తమను గట్టెక్కిస్తుందని నిన్నటి వరకూ నమ్మారు.పసుపు కుంకుమ తీసుకున్న చెల్లెమ్మలు దాదాపు కోటి వరకూ ఉండటంతో ఆ ఓట్లన్నీ తమకే పడతాయని భావించారు. కానీ చెక్కులు తీసుకునేటప్పుడు చెల్లెమ్మల మనోగతం ఒకలా ఉంది. అధికారులు చెక్కులిచ్చినప్పుడు చంద్రన్న జిందాబాద్ అన్న చెల్లెమ్మలే అధిక శాతం చెక్కులను బ్యాంకులో మార్చుకునేందకు వెళ్లినప్పుడు జగన్ చెబితేనే కదా? ఇచ్చింది, ఎన్నికల ముందు నాలుగు చెక్కులిస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఇంటలిజెన్స్ నివేదికల ద్వారా చంద్రబాబునాయుడి దరికి చేరాయి.మరోసారి వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినవెంటనే ప్రస్తుతం ఇచ్చిన రెండువేల పింఛన్లను మూడు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పింఛనుదారులను ఆకట్టుకునేందుకే ఈ అంశాన్ని చంద్రబాబు మ్యానిఫేస్టోలో పెట్టనున్నారు. దాదాపు కోటిన్నరకు పైగానే ఉన్న పింఛనుదారుల కనీస వయసునుకూడా తగ్గించనున్నట్లు తెలిపారు. 60 ఏళ్లకే పింఛను వచ్చేలా అధికారంలోకి రాగానే ఉత్తర్వులు ఇస్తామని చెబుతున్నారు. ఇక 300 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న వారికి ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఓటమి అంచున ఉన్నామని తెలిసే ఇలాంటి ఎత్తులకు దిగుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.