YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పొత్తుల విషయంలో కాంగ్రెస్ ఫెయిల్

పొత్తుల విషయంలో కాంగ్రెస్ ఫెయిల్
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ నేతృత్వంలోని కూట‌మి, దానిలో పార్టీలు అన్నీ స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. కానీ, ప్ర‌త్య‌ర్థి వ‌ర్గంలో ఆ పొందిక క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల ముందు పొత్తుల కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్ర‌య‌త్నించిందా..? రాహుల్ గాంధీ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదా..? ఇంకాస్త కృషి చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ పొత్తు విష‌యంలో మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చి ఉండేదా…. ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెర మీదికి వ‌స్తున్నాయి. పొత్తుల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌యత్నాలు ఆశించిన స్థాయిలో జ‌ర‌గ‌లేద‌నే విశ్లేషించుకోవాలి. రాహుల్ గాంధీ ప్ర‌య‌త్నంలో లోపాన్ని కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌స్థావించుకోవాలి. ప్ర‌స్తుత లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి గ‌తం కంటే చాలా భిన్నంగా ఉంది. ఆ భిన్న‌త్వాన్ని గుర్తించి, వ్య‌వ‌హార శైలిలో కొంత మార్పు చేసుకుని ఉంటే… ప్ర‌స్తుతం పొత్తుల విష‌యంలో కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌రింత మెరుగ్గా ఉండేదేమో. మ‌రీ ముఖ్యంగా.. పెద్ద‌న్న పాత్ర ప‌రిధిని దాటి కాంగ్రెస్ బ‌య‌ట‌కి రాలేక‌పోయింది. ఎంత వ‌ద్ద‌నుకున్నా.. కూట‌మి తామే నాయ‌క‌త్వం వ‌హిస్తామ‌నీ, ప్ర‌ధానమంత్రి రాహుల్ గాంధీ మాత్ర‌మేన‌న‌, అంద‌రూ ఆయ‌న‌కే మ‌ద్ద‌తు ఇవ్వాల‌నే ధోర‌ణిలోనే వ్య‌వ‌హ‌రించింది.‌ కూట‌మి ప్ర‌ధాని అభ్య‌ర్థి ఆయ‌న కాదు.. అనే అభిప్రాయాన్ని ఇత‌ర పార్టీల‌కు క‌ల్పించ‌డంలో కొంత వైఫ‌ల్యం చెందింది. కాంగ్రెస్ లోని కొంత‌మంది సీనియ‌ర్ నేత‌లు ఆ ప్ర‌య‌త్నం చేసినా, పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేదు. అందుకే, మ‌మ‌తా బెన‌ర్జీగానీ అఖిలేష్ యాద‌వ్ గానీ, మాయావ‌తిగానీ… ఇలాంటి కీల‌క నేత‌లంతా ఎన్నిక‌లు స‌మీపించేస‌రికి రాహుల్ గాంధీకి కాస్త దూరం జ‌రిగారు. ఎన్నిక‌ల త‌రువాత వారికి కూడా జాతీయ రాజ‌కీయాల్లో వారికి ద‌క్కాల్సిన అవ‌కాశాల‌ను వారే సృష్టించుకునే ప్ర‌య‌త్నంలో ప‌డ్డారు. ఫ‌లితంగా, ఎన్నిక‌ల ముందు భాజ‌పా వ్య‌తిరేక పార్టీల పొత్తును కుదిర్చుకునే ఒక గొప్ప అవ‌కాశాన్ని చేజేతులా వ‌దిలేసుకున్న‌ట్ట‌యింది. పొత్తులు అంటే ఒక సంప్ర‌దాయ ధోర‌ణికి అల‌వాటుప‌డిపోయిన కాంగ్రెస్.. దాన్నుంచి బ‌య‌ట‌కి రాలేక‌పోయింద‌ని చెప్పొచ్చు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ ప్ర‌య‌త్న లోపం కూడా క‌చ్చితంగా చ‌ర్చ‌నీయాంశ‌మే. భాజ‌పాకి వ్య‌తిరేకంగా ఏర్ప‌డిన ప్రాంతీయ పార్టీల కూట‌మిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంద‌నే అభిప్రాయం క‌లిగించేలా ఆయ‌న మొద‌ట్లో వ్య‌వ‌హ‌రించారు. క‌ర్నాట‌క‌లో ఆ ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. అక్క‌డే కీల‌క పార్టీల నేత‌లంతా తొలిసారి ఐక‌మ‌త్యాన్ని చాటారు. ఆ త‌రువాత‌, కోల్ క‌తాలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఆ త‌రువాతి నుంచి కూట‌మి ప్ర‌య‌త్నాల‌కు ఏ ఇత‌ర ప్రాంతీయ పార్టీలూ పెద్ద‌గా చొర‌వ చూప‌లేదు. స‌రిగ్గా, ఈ స‌మ‌యంలో రాహుల్ గాంధీ చొర‌వ తీసుకుని ఉంటే… ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. ఇత‌ర పార్టీల‌తో రాహుల్ చ‌ర్చ‌ల‌కు వెళ్లే ప్ర‌య‌త్నం కూడా చెయ్య‌లేదు. 

Related Posts