యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈ ఎన్నికల్లో కచ్చితంగా జయకేతనం ఎగరేయాలని పట్టుదలగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన స్టైల్ మార్చారు. గతానికి భిన్నంగా ప్రసంగిస్తూ ఆయన ప్రజలను ఆకట్టుకునేందకు ప్రయత్నిస్తున్నారు. ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అంటూ ప్రజలకు భరోసా ఇచ్చేలా మాట్లాడుతున్నారు. మొదట ఆయన స్పీచ్ లు రొటీన్ గా అనిపించినా వారం రోజులుగా భిన్నంగా ఉంటున్నాయి. ఎక్కడ ప్రచార సభకు హాజరైనా ముందు తన పాదయాత్రను ఆయన గుర్తు చేస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా తాను అన్ని వర్గాల కష్టాలు చూశానని, విన్నానని.. తాను ఉన్నానని చెప్పి తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా జగన్ బహిరంగ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఏ నియోజకవర్గంలో ఆయన సభ ఏర్పాటు చేసినా ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. వచ్చిన వారు జగన్ ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నారు. ఆయన మాటలకు స్పందిస్తున్నారు. ఇది వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.ఇక, ప్రతీరోజూ ఓ వైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్, మోడీకి జగన్ సరెండర్ అయ్యారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైఎస్ వివేకాను జగనే చంపారనేలా చంద్రబాబు విమర్శిస్తుండగా స్వంత చిన్నాన్ననే జగన్ కాపాడుకోలేకపోయారని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు. వారిద్దరూ ఈ రెండు అంశాలను ప్రచారస్త్రాలుగా చేసుకొని ముందుకుపోతున్నారు. జగన్ వీటికి పెద్దగా కౌంటర్ ఇవ్వడం లేదు. దీంతో గత పదిహేను రోజులుగా ఒకే వైపు వాదన ప్రజల్లోకి వెళ్లింది. దీంతో జరిగే నష్టాన్ని జగన్ తెలుసుకున్నట్లున్నారు. నిన్న తాడిపత్రిలో జరిగిన సభలో జగన్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు తాను టీడీపీ అనుబంధ మీడియాకి గట్టి కౌంటర్ ఇచ్చారు.రోజులుగా తనపై చేస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తే చంద్రబాబుకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్.. చంద్రబాబు ఆస్తులు లాక్కున్నారా లేదా రామోజీరావు, రాధాకృష్ణ ఆస్తులు లాక్కున్నారా అని ప్రశ్నించారు. తన రాజకీయం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. తనపై విమర్శలకు కౌంటర్ ఇవ్వడం కంటే ఎక్కువగా జగన్ తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే నవరత్నాలు, ఇతర అభివృద్ధి పనుల గురించే ఎక్కువగా చెబుతున్నారు. అనవసర విమర్శలకు దిగకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే తాను అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను చెబుతున్నారు. తనపై వచ్చే విమర్శలకు పెద్దగా కౌంటర్ ఇవ్వకుండా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మాట్లాడుతున్నారు. జగన్ సభలకు జనాలు రావడం ఇప్పుడే కొత్తేమీ కాదు కానీ ఆయన వారిని ఓట్లుగా మరుల్చుకుంటేనే విజయతీరాలకు చేరుతారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.