YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మ్యానిఫెస్టోల కోసం ఎదురుచూపులు

మ్యానిఫెస్టోల కోసం ఎదురుచూపులు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నికల గడువు ముంచుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇంకా మ్యానిఫేస్టోలనువిడుదల చేయలేదు. దీనికి ప్రధానకారణం ఎన్నికల్లో నెగ్గాలంటే మ్యానిఫేస్టో యే కీలకం కావడం. ఎవరు ముందు విడుదల చేస్తే వారికంటే బాగా మ్యానిఫేస్టోను విడుదల చేయాలని ఇరు పార్టీల నేతలు ఉన్నారు. ఇది ఒక ఎత్తుగడ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మ్యానిఫేస్టోను ఇప్పటికే రూపొందించారు. కమిటీ గత కొన్నాళ్లుగా చేసిన కసరత్తులు ఒక కొలిక్కి వచ్చాయి. అయినా మ్యానిఫేస్టోను విడుదల చేయలేదు.ప్రత్యర్థి పార్టీ కన్నా తమ మ్యానిఫేస్టోలో ప్రజలను ఆకట్టకునే ఎక్కువ అంశాలు ఉండాలన్నది ఇరు పార్టీల ఆలోచనగా తెలుస్తోంది. మ్యానిఫేస్టోతోనే ప్రజలను ఆకర్షించాలని వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. తమిళనాడు తరహాలో వరాల జల్లులు ఓటర్ల పై ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. సీనియర్ నేత యనమల రామకృష్ణుడి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మ్యానిఫేస్టో కమిటీ రూపొందించింది. ఇప్పటికే పింఛన్లను తాము అధికారంలోకి రాగానే మూడు వేల రూపాయలకు పెంచనున్నట్లు లీకులు వచ్చాయి. అలాగే 300 చదరపు గజాల స్థలం ఉన్నవారికి ఉచితంగా ఇంటిని నిర్మిస్తామంటున్నారు. ఇన్ని లీకులు వస్తున్నా మ్యానిఫేస్టోను బయటకు విడుదల చేయలేదు టీడీపీ.ప్రధాన కారణం వైఎస్సార్ కాంగ్రెస్ మ్యానిఫేస్టోను బట్టే తాము మార్పులు, చేర్పులు చేసి విడుదల చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ మ్యానిఫేస్టోకు సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వం వహిస్తున్నారు. వైసీపీ, టీడీపీ మ్యానిఫేస్టో కమిటీలు రూపొందించి నివేదికలను తమ తమ అధ్యక్షులకు అందజేశాయి కూడా. అయితే మ్యానిఫేస్టోను ప్రకటిస్తామని చెప్పడం వాయిదా వేయడం ఇరు పార్టీల్లో జరిగింది. జగన్ ఇప్పటికే రెండేళ్ల క్రితమే పార్టీ ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించారు. వాటినే మ్యానిఫేస్టోలో పొందుపర్చాలని జగన్ సూచించారు. నవరత్నాలతో పాటుగా పాదయాత్రలో వచ్చిన సమస్యలను కూడా అందులో చేర్చనున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.చంద్రబాబుకూడా ఎన్నికలకు ముందుగానే ప్రజలపై వరాలు కురిపించారు. మ్యానిఫేస్టోలో కొత్తగా జత చేసే అంశాలపై చంద్రబాబు తుదిమెరుగులు దిద్దుతున్నారు. వైసీపీ కంటే తమ మ్యానిఫేస్టోనే మెరుగ్గా ఉండాలని టీడీపీ భావిస్తోంది. జగన్ పార్టీ కూడా తాము ప్రకటించే అంశాలను చంద్రబాబు తమ మ్యానిఫేస్టోలో చేరుస్తారన్న భయంతో విడుదల చేయడానికి వెనకడుగు వేస్తోంది. మొత్తం మీద రెండు పార్టీలు మ్యానిఫేస్టోలను సిద్ధం చేసినా, విడుదలకు మాత్రం జాప్యం చేయడానికి కారణాలు ఒకరి కంటే మరొకరిది ప్రజాకర్షణగా ఉండాలనుకోవడమే. ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేకపోవడంతో మ్యానిఫేస్టోలో అంశాలు ప్రజలకు సత్వరం చేరతాయా? అన్న అనుమానమూ లేకపోలేదు.

Related Posts