యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. విశాఖపట్నంలోని గాజువాక నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన విజయం అక్కడ అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే అక్కడ టీడీపీ, వైసీపీ శ్రేణులు బలోపేతం అయ్యాయి. కానీ, జనసేన కేడర్ మాత్రం ఇంకా నిలదొక్కుకునే స్థాయిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు పవన్ విజయానికి మరింత శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం పవన్ తన పార్టీ తరఫున ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో గాజువాకలో ఆయన కోసం శ్రమించే సరైన నాయకుడు కరవైనట్లు తెలుస్తోంది. ఆయన సీఎం అభ్యర్థి కూడా. మొదటి నుంచి పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంపై స్పష్టత లేకపోవడం వల్ల కూడా అక్కడ కేడర్ అన్నివిధాలా సిద్ధం కాలేకపోయింది. అయితే, ఇప్పుడు పోలింగ్‌కు ఎన్నో రోజులు లేకపోవడంతో అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేసే ప్రయత్నంలో జనసేన ఉంది. పవన్ విజయానికి అక్కడ ఏదైనా కలిసి వచ్చే అంశం ఏదైనా ఉందంటే అది కేవలం ఆయన పాపులారిటీ మాత్రమే. దీనికి ఆయన సామాజికవర్గం ఓట్లు తోడైతే తప్పకుండా విజయం వరిస్తుంది. గాజువాక మాజీ శాసనసభ్యుడు, జనసేన నేత చింతలపూడి వెంకట్రామయ్యకు ఈ నియోజకవర్గంలో మంచి పట్టు వుంది. కానీ పవన్ కల్యాణ్ పోటీ కోసం చింతలపూడిని పెందుర్తికి మార్చారు. దీంతో ఇక్కడ నాయకత్వ లోటు ఏర్పడింది. దీనికి తోడు స్థానిక నేతలనే ఎన్నుకోవాలనే నినాదం గాజువాకలో మారు మ్రోగుతోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోడానికి ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, అటు వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పల్లా మీద వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని తిప్పల నాగిరెడ్డి భావిస్తున్నారు. నాగిరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పుడు 33,087 ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు 75,397 ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 21,572 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇందుకు పవన్ కళ్యాణ్ మద్దతుతో కాపు సామాజిక వర్గం ఓట్లు, మోడీ హవా అప్పట్లో పల్లాకు విజయాన్ని అందించాయి. అయితే, ఇప్పుడు ఆ రెండు లేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతతో పల్లా విజయం అంత సులభం కాదని తెలుస్తోంది. అయితే, గాజువాకలో పల్లా సామాజిక వర్గం బలమైనది కావడం, వైసీపీ ఓట్లు జనసేనకు పడితే విజయం తథ్యమేనని పల్లా ధీమాతో ఉన్నారు.పవన్ గాజువాకలో గెలవరేని వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి అంటున్నారు. పవన్ మూడో స్థానానికి ఎప్పుడో వెళ్లిపోయారని, ఇప్పుడు ఫ్యాన్ గాలి వీస్తోందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి రావాలనే కాంక్ష ప్రజల్లో పెరగడం వల్ల గాజువాకలో వైసీపీనే విజయం వరిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ‘స్థానిక’ అంశాన్ని వీరు ఆయుధంగా మలుచుకుంటున్నారు. పవన్‌ను గెలిపిస్తే ఇక్కడ ఉంటారా? నామినేషన్ తర్వాతే మళ్లీ పత్తాలేకుండా పోయారంటూ వైసీపీ, టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తు్న్నాయి. పవన్ గాజువాకను ఎంపిక చేసుకోడానికి బలమై కారణమే ఉంది. రాష్ట్రంలో జనసేనకు బలమున్న కేంద్రం గాజువాక అని సర్వేలో తేలిందట. అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం నుంచి కొత్త అభ్యర్థిగా బరిలో దిగిన చింతలపూడి వెంకట్రామయ్య సుమారు 17వేల ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. అలాగే, అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్, తమ సామాజికవర్గం ఓట్లు తప్పకుండా జనసేనకు విజయం తెచ్చిపెడతాయని సర్వేలో తేలడంతో పవన్ గాజువాక నుంచి పోటీకి మొగ్గుచూపారు.గాజువాకలో ఈ సమస్యను గుర్తించిన పవన్.. స్థానిక నేతలతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. పవన్ అధ్యక్షత వహించే ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఈ స్టీరింగ్ కమిటీలో తిప్పల రమణారెడ్డికి స్థానం కల్పించనున్నట్లు తెలిసింది. అలాగే పవన్ కళ్యాణ్ నియోజక వర్గంలో మూడు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. గాజువాక నియోజకవర్గంలోని 16వార్డుల్లోని ఐదు వార్డుల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. వాటితోపాటు పవన్ ప్రత్యేకంగా రోడ్ షో కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ మినహా మిగతా 15 వార్డుల్లో పార్టీ కార్యాలయాలు తెరవాలని భావిస్తున్నారు. తమ జనసేనాని విజయం కోసం పవన్ అభిమానులు మరింత ఉత్సాహంగా పనిచేస్తే.. పవర్ స్టార్ విజయం ఖాయం.