యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను తాజాగా విడుదల చేసింది. కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు తర్వాత తుది అనుబంధ జాబితాను విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ-2019కు సంబంధించి జనవరి 11న తుది జాబితా ప్రచురించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 24,12,626 మంది ఓటర్లు పెరిగారు. రెండున్నర నెలల వ్యవధిలో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. తాజా లెక్కల ప్రకారం మహిళా ఓటర్లు 1,98,79,421 మంది నమోదు కాగా, పురుష ఓటర్లు 1,94,62,339 మంది పురుష ఓటర్లు నమోదయ్యారు. అంటే, పురుష ఓటర్లు కంటే 4,17,082 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,957 మంది ఉన్నారు. అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలిచింది. ఈ జిల్లాలో 42,04,436 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 39,74,491 మంది ఓటర్లతో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో విజయనగరం జిల్లా చివరిస్థానంలో ఉంది. ఈ జిల్లాలో ఓటర్ల సంఖ్య 18.18 లక్షలే. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఓటర్ల సంఖ్య 20 లక్షల మార్కు దాటింది. రాష్ట్రంలో శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 29.88 శాతం మంది ఓటర్లు తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల పరిధిలోనే ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో థర్డ్ జెండర్స్ ఓటర్లు ఉన్నారు. అతి తక్కువ ఓటర్లు కలిగిన జిల్లాల జాబితాలో విజయనగరం మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత శ్రీకాకుళం, కడప జిల్లాలు ఉన్నాయి.