YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎస్పీ-బీఎస్పీ కూటమిలోకి మరో మూడు పార్టీలు

ఎస్పీ-బీఎస్పీ కూటమిలోకి మరో మూడు పార్టీలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమిలోకి మరో మూడు పార్టీలు చేరుతున్నట్లు ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు. నిషద్‌ పార్టీ, జన్‌వాడీ పార్టీ, రాష్ట్రీయ సమతా దళ్‌ నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారని తెలిపారు. ఆ పార్టీ అధ్యక్షులతో కలిసి ఆయన మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పార్టీలకు కొన్ని సామాజిక వర్గాల్లో పట్టు ఉండడమే పొత్తుకు కారణంగా తెలుస్తోంది. ఎలాగైనా భాజపాను ఓడించాలని పట్టుదలతో ఉన్న ఎస్పీ-బీఎస్పీ.. అందుకు గల అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ తూర్పులో అత్యధికంగా ఉన్న చౌహాన్‌, వెనకబడిన ఓబీసీ సామాజిక వర్గాల్లో జన్‌వాడీ పార్టీకి మంచి ఆదరణ ఉంది. 2018లో గోరఖ్‌పూర్‌ ఉపఎన్నికలో నిషద్‌ పార్టీ కీలకపాత్ర పోషించింది. దీంతో ఈ పార్టీలతో పొత్తుకు అఖిలేశ్‌ మొగ్గుచూపారు.
అలాగే భాజపాపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ ఇటీవల భాజపాకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యల్ని పరోక్షంగా గుర్తుచేస్తూ.. భాజపా నాయకులు గవర్నర్లు, మీడియాను ప్రచారానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌జేడీ సార్వత్రిక ఎన్నికల కోసం జట్టు కట్టిన విషయం తెలిసిందే. ఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీఎస్పీ 38 సీట్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపనుంది. ఆర్‌ఎల్‌డీ మూడు సీట్లలో పోటీ చేయనుంది. సోనియా, రాహుల్‌గాంధీ పోటీచేసే రాయ్‌బరేలీ, అమేఠీ స్థానాల్లో మాత్రం అభ్యర్థులను నిలపబోమని వెల్లడించారు. 

Related Posts