YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కల్యాణోత్సవానికి రారండోయ్.. పొరుగు రాష్ట్రాల కోసం హిందీలో గోడపత్రికలు

కల్యాణోత్సవానికి రారండోయ్..  పొరుగు రాష్ట్రాల కోసం హిందీలో గోడపత్రికలు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

భద్రాద్రి రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణ ఘడియలు దగ్గరపడుతున్న కొద్దీ పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు వసతి గదులకు రంగులు వేసే పనులు చేపట్టగా వైదికపరంగా కల్యాణ పనులను తలంబ్రాలను కలిపి ఆరంభించారు. ఇరు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత కల్యాణోత్సవం ఉండటంతో భక్తులు భారీ సంఖ్యలోనే వస్తారన్న అంచనాతో అన్ని శాఖలు కలిపి సుమారు రూ.1.5 కోట్లతో ఏర్పాట్లు చేపట్టాయి. భద్రాద్రి ఉత్సవాల ప్రచారం కోసం తాత్కాలిక ప్రాతిపదికన అంతర్జాలాన్ని ఉపయోగిస్తుండగా ఇదే వెబ్ సైట్లో సెక్టార్ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల తరుణం కావడంతో తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో తమ పిల్లలపై దృష్టి సారించారు. ఇంటర్ పరీక్షలు ఇప్పటికే పూర్తవ్వగా కల్యాణానికి ముందే పది పరీక్షలు పూర్తి కానుండటంతో మొక్కుల్లో భాగంగా ఎక్కువ మంది యువత తరలి వస్తారని భావిస్తున్నారు. శ్రీరామనవమికి రావాలని కోరుకుంటున్న అందర్నీ రప్పించాలన్న ఉద్దేశంతో ఈవో తాళ్లూరి రమేశ్బాబు నేతృత్వంలో ఏఈవో శ్రావణ్కుమార్, డీఈ రవీందర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రసాదాల తయారీతోపాటు ఆ సమయంలో అవసరమైన వంటల కోసం పాత్రలను కొనాలని అనుకుంటున్నారు. ఇలాంటివి కొనుగోలు  చేసేందుకు ఏర్పాటు చేసే కమిటీల్లో ఆలయ సూపరింటెండెంట్లను విస్మరించి గుత్తేదారులకు చోటు కల్పిస్తే విమర్శలు తప్పవు.
ప్రచారానికి ప్రాధాన్యం 
గోడ పత్రికలతోపాటు ఆహ్వాన పత్రికలను ప్రతీసారి మంత్రులతో విడుదల చేసేవాళ్లు. ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆ ఆనవాయితీని పాటించడం కుదిరే పనికాదు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఊరూరా ప్రచారం చేపట్టాలని అధికారులు భావించి 3 వేల ఆహ్వాన పత్రికలను ముద్రించారు. గోడ పత్రికలను అదేస్థాయిలో సిద్ధం చేశారు. పొరుగున ఉన్న ఛత్తీస్ గఢ్, ఒడిశా నుంచి రామ భక్తులు ప్రతీసారి వస్తున్నందున అక్కడి ముఖ్య పట్టణాల్లో గోడ పత్రికలను అంటించేందుకు కార్యాచరణ రూపొందించారు. 500 గోడ పత్రికలను హిందీలో ముద్రించారు. ఇలాంటి ప్రచారంపై పక్కా ప్రణాళిక లేకుంటే చేసే ఏర్పాట్లు ఎందుకూ ఉపయోగం లేకుండా పోయే అవకాశం ఉంది. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు బ్రహ్మోత్సవాలున్నాయి. 13న ఎదుర్కోలు, 14న శ్రీరామ నవమి, 15న పట్టాభిషేకం వేడుకలున్నాయి. ఇవి భక్తుల పరంగా ప్రధానమైనవి. ఈ షెడ్యూల్ అందరికీ అర్థం అయ్యేలా నిర్ధిష్టమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రాచలం రామాలయం ఉత్సవాలపై ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆహ్వాన పత్రికలు సైతం మిగిలిపోయే వీలుందని సిబ్బంది అంటున్నారు.
మిథిలా మండపం వద్ద ఏసీ ఏర్పాటు 
రామాలయం నుంచి సుమారు రూ.85 లక్షలతో పనులు చేపట్టగా ఇది ఇంకా పెరిగే వీలుంది. 20 వేల మంది మిథిలా ప్రాంగణంలో కూర్చునేలా చలువ పందిరిని నిర్మించి ఇందులో సెక్టార్ల వారీగా 75 ఫ్యాన్లతోపాటు 45 కూలర్లను సిద్ధం చేయనున్నారు. ముత్యాల తలంబ్రాలతోపాటు పట్టు వస్త్రాలు ఎవరు తీసుకొస్తారన్నది అధికారిక ప్రకటన వెలువడే వరకు చెప్పలేని పరిస్థితి. ప్రతీసారి ఈ సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి కొనసాగించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా ఆయన రాకపోవచ్చని భావిస్తున్నారు. దేవాదాయశాఖ అధికారులకు ఈ అదృష్టం వరించే వీలుంది. 15న పట్టాభిషేకానికి గవర్నర్, ఇతర ప్రముఖులు వస్తారని గత అనుభవాల ప్రకారం భావిస్తున్నారు. ఇలాంటి ముఖ్యుల కోసం మండపానికి ఎదుట శీతలీకరణ పనులు చేయనున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి ఉక్కపోత ఉండకుండా దేవాదాయశాఖ తరఫున 36 టన్నుల సామర్థ్యంతో ఏసీని ఏర్పాటు చేయనున్నారు. ఇది పండుగ సమయంలో రెండు రోజులు పని చేయనుంది. గోదావరి వద్ద ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి. ఆలయం తరఫున ఇద్దరు గజ ఈతగాళ్లు ఉన్నప్పటికీ ఈ సంఖ్యను పెంచాల్సి ఉంది. ఇటీవల నదుల్లో మునిగి పలువురు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు భద్రాచలం చుట్టుపక్కల చోటు చేసుకున్నాయి. ఎక్కువ మంది భక్తులు స్నానాలు చేసేందుకు రానున్నందున ఘాట్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. నీటిపారుదలశాఖ ఇప్పటికైనా అప్రమత్తమై తాము ఈ ఉత్సవాలకు ఏం చేయదలిచారో ప్రకటించాల్సి ఉంది.
మంచినీళ్లు... అన్న ప్రసాదం అందించాలి 
ట్రాన్స్కో అధికారులు ఉత్సవాలు సమీపించే సరికి విద్యుత్తు కోతలను విధించి అప్పుడు మరమ్మతులు చేస్తుంటారు. ఇలా చేయడం తప్పనిసరి అయితే ముందుగానే వినియోగదారులకు చెప్పడం వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారని గుర్తించాలి. ఆర్డబ్ల్యూఎస్ తరుఫున 3 లక్షల మంచినీటి పొట్లాలు, 2 లక్షల మజ్జిగ పొట్లాలను అందుబాటులో ఉంచాలని ప్రణాళిక తయారు చేశారు. శ్రీరామనవమి సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. జనం రద్దీ వల్ల ఉక్కపోతకు కొదవే ఉండదు. అలాంటప్పుడు ఈ మంచినీటి పొట్లాలు ఒక మూలకు రావు. ఇంకా ఎక్కువ మొత్తంలో పంపిణీ చేసేందుకు ఈ ప్రాంతంలో ఉన్న కేటీపీఎస్, ఐటీసీ పీఎస్పీడీ, నవభారత్, భారజల ప్లాంట్, సింగరేణి సంస్థల సహకారం తీసుకుంటే వేసవిలో భక్తులందరికీ సురక్షిత మంచినీటిని అందించవచ్చని పలువురు సూచిస్తున్నారు. 534 బస్సులు పండుగ సందర్భంగా అన్ని డిపోల సహకారంతో తిప్పాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారన్న అంచనాతో అక్కడి అధికారులు కూడా బస్సులను తిప్పనున్నారు. భద్రాచలం నుంచి పర్ణశాలకు ప్రతీ 10 నిమిషాలకో బస్సు ఉంటుంది. లక్ష మంది వచ్చినా అన్నదానం చేసే దాతలు, సంస్థలు, ప్రైవేటు దేవాలయాలు ఉన్నందున ఆ యాజమాన్యాలను సమన్వయం చేసుకుని ముఖ్య కూడళ్లలో విరివిగా అన్నదానం ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
పారిశుద్ధ్యం లోపిస్తే అంతే సంగతులు 
పారిశుద్ధ్యం కోసం ఎక్కువ మంది కార్మికులను పనిలో ఉంచితేనే భద్రాద్రి దర్శనం భక్తులకు ఆనందం కలిగిస్తుంది. ఈ విషయంలో గ్రామ పంచాయతీ పాత్ర కీలకం కానుంది. ఈ విభాగం చేసే ఖర్చును రామాలయం కూడా భరించాల్సి ఉన్నందున ఇప్పటికైనా ప్రణాళిక వెల్లడిస్తే పారదర్శకత వస్తుందని అంటున్నారు. సీనియర్ అధికారి ఉన్నప్పటికీ ఎక్కువ బాధ్యతలు ఒకరే చూడాల్సి రావడంతో పర్యవేక్షణ ఇబ్బంది ఉండే వీలుంది. సమీక్షలకు మంత్రులు వచ్చే అవకాశాలు లేనందున ఇది అధికారులకు సవాల్గానే మారింది. తూనికలు, కొలతలు శాఖతోపాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇక్కడి హోటళ్లను తనిఖీ చేసి నిబంధనలు పాటించాలని ఆదేశిస్తే మంచిది. నీడను అందించేందుకు ఆలయానికి వెళ్లే దారుల్లో తడికల పందిరి ఉండేలా చూడాలి. 100 మరుగుదొడ్లు శాశ్వత ప్రాతిపదికన నిర్మించినప్పటికీ ఇందులో కొన్ని ఎందుకు పనికిరావు. ఇంకో 75 మరుగుదొడ్లను తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించనున్నారు.
భద్రాద్రి రాముడి కల్యాణ వైభవం 
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం తలుపులు తెరిచిన తర్వాత అర్చకులు రామయ్యను ఆరాధించి సుప్రభాత పూజలను కొనసాగించారు. ముత్తంగి రూపంలో దేవదేవుడు దర్శనం ఇవ్వడంతో భక్తులు ఉప్పొంగిపోయారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతులైన సీతారామచంద్రుల దర్శనంతో భక్తుల మది పులకించింది. తమకు కలిగిన అదృష్టానికి తన్మయులై కానుకలను సమర్పించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. బేడా మండపం వద్ద క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేసిన తీరు మంత్రముగ్ధులను చేసింది. భద్రాద్రిలో శ్రీరామ దర్శనం చేసుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని వైదిక పెద్దలు సుభాషించారు. ప్రధానార్చకుడు విజయవరాఘవన్, ఉప ప్రధానార్చకుడు రామస్వరూప్ నేతృత్వంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేనుణ్ని ఆరాధించి పుణ్యాహ వాచనం నిర్వహించి కంకణ ధారణ చేశారు. వధూవరుల గోత్ర నామాలను చదివి ప్రవరను పఠించారు. కన్యాదానం కమనీయమై నిలవగా సీతమ్మకు యోక్త్రధారణ రామయ్యకు యజ్ఞోపవీత ధారణ అట్టహాసంగా సాగింది. జేజే నీరాజనాల మధ్య మాంగళ్యధారణ చేపట్టడంతో మది మది పులకించింది. దర్బారు సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

 

 

Related Posts